దర్బార్ లో డాబు ఉంది జగన్ బాబూ !

ఈ సత్యం వైసీపీ అధినాయకత్వానికి చాలా ఆలస్యంగా బోధపడింది అని అంటున్నారు.

Update: 2024-07-14 03:45 GMT

జగన్ అధికారంలో అయిదేళ్ళు ఉన్నపుడు తట్టని ఆలోచన విపక్షంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలో రావడం మంచి విషయమే. రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో ఉండాలి. నీటిలో చేప ఎలా అయితే హాయిగా జీవించగలదో అదే విధంగా రాజకీయ నేతలు కూడా ప్రజలతో ఉన్నప్పుడే రాణిస్తారు, జీవిస్తారు.

జనాలతో కనెక్షన్ కట్ అయ్యాక ఏమి చేసినా ప్రయోజనం లేదు. ఈ సత్యం వైసీపీ అధినాయకత్వానికి చాలా ఆలస్యంగా బోధపడింది అని అంటున్నారు. ఒక కవి గారు అన్నట్లుగా ఎక్కే రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఆలోచనలు కూడా చాలా లేటుగా వచ్చాయి.

నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలలోనే ప్రజలను కలుసుకునే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భావించారు అని ప్రకటనలు వెలువడ్డాయి. కానీ అవి ఎందుకో ఆచరణకు నోచుకోలేదు. ఆ తరువాత రచ్చ బండ అన్నారు. ప్రతీ నెలలో ఒక రోజు పల్లెకు వెళ్ళి పల్లె నిద్ర చేస్తారు అక్కడ సమస్యలు తెలుసుకుంటారు అని కూడా చెప్పుకొచ్చారు.

అయితే అవన్నీ ఉత్త ప్రకటనలకే పరిమితం అయిపోయాయి. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాకు పోయింది. దాని ఫలితాన్ని జనాలు అందించారు. దీంతో నెలన్నర రోజుల శోధన తరువాత వైసీపీ ప్రజలకు ఎలా చేరువ కావాలి అన్న కాన్సెప్ట్ ని కనుగొంది. జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే ప్రజా సమస్యలు వేదికగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

దాని పేరు ప్రజా దర్బార్ అని పెట్టారని అంటున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15 నుంచి మొదలవుతుందని కూడా చెబుతున్నారు. అయితే ప్రజా దర్బార్ అన్న పేరు మీద మళ్ళీ ట్రోలింగ్ సాగుతోంది. దర్బార్ అంటే రాజులు వారి అధికార దర్పం అంతా అందులో కనిపిస్తాయని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దర్బార్ అన్నది అహంకారానికి ప్రతిబింబంగా ఉంటుందని అంటున్నారు.

జగన్ అధికారంలో లేరు. పైగా ప్రజలకు చేరువ అవుదామని అనుకుంటున్నారు. వారి సమస్యలను తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజల వద్దను నాయకుడు వెళ్ళే విధంగా టైటిల్ ఉండాలని అంటున్నారు. అంతే కాదు ప్రజలు కూడా తాము ప్రజా సేవకుడి వద్దకు వెళ్తున్నామని భావించాలి తప్ప రాజుల కోటలోకి ప్రవేశిస్తున్నామని అనుకోకూడదు.

కానీ ప్రజా దర్బార్ అన్న దాంట్లోనే ఆడంబరం ఉంది హంగు ఉందని అంటున్నారు. అందువల్ల ఆ పదం సూట్ కాదని అంటున్నారు. జగన్ జనాలకు దూరంగా అయిదేళ్ళ పాటు ఉన్నారని అధికార పరదాల మాటున గడిపారు అని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలతో కలసి మెలసి ఉండేలా ఫ్రెండ్లీగా క్యాచీగా టైటిల్ ఉంటేనే రిసీవింగ్ బాగుంటుంది అని అంటున్నారు.

ఇక జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన సమస్యలు తెలుసుకున్నా తీర్చలేరు. అయితే ఆయన అధికార పక్షానికి నివేదించగలరు. దానికి అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజా వేదిక సహా ఇతర వ్యవస్థలను ఉపయోగించుకుంటేనే ఈ ప్రజా సమస్యల వినతుల స్వీకరణకు ఒక పరమార్ధం ఉంటుంది అని అంటున్నారు.

అంతే కాదు ప్రజలకు నేరుగా వారధిగా ఉన్న మీడియా ద్వారా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఆ అవకాశాన్ని జగన్ ఉపయోగించుకోవాలని అంటున్నారు. మీడియా ఫ్రెండ్లీగా కూడా వైసీపీ మారాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్రజా దర్బారు లో దర్బార్ ని తీసి పక్కన పెడితేనే బాగుంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News