వైఎస్సార్, వివేకా, చెల్లెమ్మలు... పులివెందులలో జగన్ ప్రసంగం వైరల్!

ఈ సమయంలో తాజాగా కడపలో పర్యటించిన జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-25 07:37 GMT

రాష్ట్రమంతా వైసీపీ వర్సెస్ కూటమి అనే పోటీ నడుస్తుంటే... కడపలో మాత్రం వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పోటీ నడుస్తుందనే కామెంట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా... పీసీసీ చీఫ్ షర్మిళ కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచీ... ఈ చర్చ మరింత వేడెక్కింది. ఈ సమయంలో తాజాగా కడపలో పర్యటించిన జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... గతకొన్ని రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసు పేరు చెప్పి జగన్ ను తన చెల్లెల్లు షర్మిళ, సునీత వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు! ఇటీవల కోర్టు ఆదేశాలు జారీచేయడంతో కాస్త కాం అయ్యారు! ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వైఎస్ జగన్ కడపకు చేరుకున్నారు. ఈ సమయంలో పులివెందులలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసగించారు.

సీఎస్‌ఐ గ్రౌండ్‌ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్... "నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ.. మీ జగన్‌, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు" అంటూ మొదలుపెట్టారు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్‌ స్టోరీ అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు జగన్.

పులివెందుల ఒక విజయగాథ!:

పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ కొంతమంది మనపై వేలెత్తి చూపిస్తున్నారని చెప్పిన జగన్... మంచి చేయడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్‌.. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డేలే అని నొక్కి చెప్పారు.

ఇదే సమయంలో... పులివెందుల అంటే అభివృద్ధి అని చెప్పిన జగన్... ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్‌ అని వెల్లడించారు. వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం అని తెలిపారు. నాడు పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి.. నేడు పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నట్లు చెబుతూ.. అందుకే పులివెందుల ఒక విజయగాథ అని జగన్ స్పష్టం చేశారు.

ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలే!:

ఇదే సమయంలో వైఎస్సార్ పైనా, జగన్ పైనా బురద జల్లడానికి, లేనిపోని ముద్రలు వేయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారని చెప్పిన జగన్... మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారని తెలిపారు. ఇదే సమయంలో... వీరితోపాటు నా ఇద్దరు చెల్లెమ్మలలు కూడా ఆ కుట్రలో భాగం అయ్యారు. ఈ సమయంలో... ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలే! అని జగన్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?.. ఆయన పేరును ఛార్జిషీట్‌ లో పెట్టింది ఎవరు?.. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లు ఎవరు?.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్‌ వారసులా? అంటూ నిప్పులు చెరిగారు జగన్.

వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా?:

అనంతరం వైఎస్ వివేకా ప్రస్థావన తెచ్చారు జగన్. ఇందులో భాగంగా... చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పిన జగన్... వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య, సంతానం ఉన్నది నిజం కాదా? ఎవరు ఫోన్‌ చేస్తే.. నాడు అవినాష్‌ అక్కడికి వెళ్లారు? పలు ఇంటర్వ్యూల్లో అవినాష్‌ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్.

ఇదే సమయంలో... వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పు చేయలేదని.. తాను అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చాను.. అవినాష్‌ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు.. అవినాష్‌ ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి అంటూ సూచించారు జగన్. ఇలా పులివెందుల సభలో జగన్ చేసిన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!!

Tags:    

Similar News