బాలయ్యను టార్గెట్ చేసిన జగన్ !

అందుకే జగన్ హిందూపురంలో బాలయ్యని ఎలాగైనా ఈసారి ఓడించాలని పట్టుదల పట్టి వస్తున్నారు అని అంటున్నారు.

Update: 2024-05-03 08:37 GMT

నందమూరి బాలక్రిష్ణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేశారా అంటే వస్తున్న సమాధానం అవును అని. నిజానికి చూస్తే బాలయ్యకు జగన్ వీరాభిమాని అని అప్పట్లో ప్రచారం సాగింది. అలాగే బాలయ్య ఇంట్లో 2004 సమయంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల కేసులలో ఇరుక్కుని ఇబ్బంది పడుతూంటే నాడు తన తండ్రి సీఎం వైఎస్సార్ తో చెప్పించి ఊరట కలిగేలా జగన్ చూసారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.

ఇక జగన్ వైసీపీ స్థాపించాక విమర్శించని ఒకే ఒక్క నాయకుడు బాలయ్య అని చెప్పాలి. బాలయ్య మీద జగన్ ఏ రోజూ నోరు విప్పలేదు. అంతే కాదు మరో విషయం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటిదాకా అనేక ఎన్నికల ప్రచార సభలు నిర్వహించిన జగన్ ఎపుడూ బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పోలేదు.

అక్కడ ఆయన ఎన్నికల సభలు పెట్టలేదు. మరి ఇదంతా ఎందుకు అంటే వైసీపీ వారికే తెలియాలి. అదే సమయంలో బాలయ్య మాత్రం జగన్ ని ఎక్కడా స్పేర్ చేసిన దాఖలాలు లేవు. బాలయ్య జగన్ ని పట్టుకుని సైకో అంటారు. దారుణంగా విమర్శిస్తారు. జగన్ మీద వ్యక్తిగత దూషణలు కూడా ఎన్నో సార్లు చేశారు.

మరి జగన్ మనసు మారిందా అంటే మారింది అని అంటున్నారు. ఆయన ఫస్ట్ టైం హిందూపురం వస్తున్నారు. అంటే బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తాను అని నమ్మకం పెట్టుకున్న సీటుని వైసీపీ పరం చేయడానికే అన్న మాట. ఈ నెల 4న జగన్ హిందూపురంలో భారీ ఎన్నికల సభను నిర్వహించాలని చూస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో జగన్ కానీ వైసీపీ కానీ గట్టి టార్గెట్లు పెట్టుకుంది. అందులో కుప్పం, మంగళగిరి, పిఠాపురం హిందూపురం ఉన్నాయి. అందుకే జగన్ హిందూపురంలో బాలయ్యని ఎలాగైనా ఈసారి ఓడించాలని పట్టుదల పట్టి వస్తున్నారు అని అంటున్నారు. బాలయ్య రెండు సార్లు గెలిచారు. కానీ అందుబాటులో ఉండరని విమర్శలు ఉన్నాయి.

అయితే బాలయ్యకు అడ్వాంటేజ్ ఏంటి అంటే సరైన ప్రత్యర్ధి లేకపొవడం. పైగా టీడీపీ పుట్టింది దగ్గర నుంచి హిందూపురంలో ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓటమి పాలు కాకపోవడం. దాంతో ఆయన విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఈసారి అయితే కోడూరి దీపికను ఎంపిక చేసింది. దానికి కారణం హిందూపురంలో బలహీన బీసీ వర్గాల నుంచి ఆమెను తీసుకున్నారు.

అలాగే హిందూపురం చరిత్రలో ఎపుడూ ఒక మహిళ ఎమ్మెల్యే కాలేదు. రాజకీయ సామాజిక సమీకరణలు అన్నీ చూసుకునే దీపికను సెలెక్ట్ చేశారు. ఇక హిందూపురంలో బాలయ్యను ఓడించే బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.

ఇపుడు ఏకంగా జగన్ హిందూపురం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి స్పీచ్ ఇస్తారు అన్న చర్చ సాగుతోంది. బాలయ్య మీద ఇప్పటిదాకా ఒక్క మాట అనని జగన్ ఈసారి నోరు విప్పుతారా ఆయన మీద ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

మరో వైపు హిందూపురం కూడా వైసీపీ ఖాతాలోకి రావాల్సిందే అన్న పట్టుదలతోనే జగన్ అక్కడికి వెళ్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో వర్గ పోరుని కూడా సెట్ చేసి అంత కలసి ఏకతాటి మీదకు వచ్చేలా చూస్తున్నారు. మొత్తానికి బాలయ్యని జగన్ ఈసారి గట్టిగానే టార్గెట్ చేసారు అని అంటున్నారు. చూడాలి మరి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News