మీ పనితీరు బాగోలేదు.. ఆ మంత్రులకు జగన్ వార్నింగ్!
ఒక్కొక్కరితో ఐదేసి నిమిషాల చొప్పున ఆయన మాట్లా డారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రికి సీరియస్ గానే జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తాజాగా ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలనే అజెండాగా రూపొందించారు. దీంతో ఆయా అంశాలపై చర్చించారు. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ఇతర విద్యుత్ సంబంధింత పెట్టుబడులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత.. కొందరు మంత్రులతో సీఎం జగన్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో ఐదేసి నిమిషాల చొప్పున ఆయన మాట్లా డారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రికి సీరియస్ గానే జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
"మీ పనితీరు బాగోలేదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీపై పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. రాకుండా చూసుకోండి. ఎన్నికలకు ముందు జాగ్రత్త" అని సీఎం హెచ్చరించినట్టు సమాచారం. ఈయనకు ఇప్పటి వరకు ప్రకటించిన మూడు జాబితాల్లోనూ చోటు లభించలేదు. దీంతో ఆయనకు వార్నింగ్ కూడా ఇవ్వడంతో ఏకంగా టికెట్ ఉంటుందో ఉండదో అనే సందేహాలు ముసురుకున్నాయి. పైగా.. ఈయన సానుకూల ధోరణితో వేరే పార్టీవైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైనే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇక, ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి కూడా జగన్ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. నిన్న మొన్నటి వరకు ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? అంటూ.. ఆయనను నిలదీసినట్టు సమాచారం. ఆయన వృత్తి పరంగా వైద్య రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ, జనసేనలపై విరుచుకుపడే అలవాటు కూడా ఉంది. అయితే.. ఇటీవల కాలంలో ఆయన సైలెంట్ అయ్యారు. ఆయనకు సొంత కేడర్‌లోనే వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. దీంతో ఆయనను కూడా సీఎం జగన్ హెచ్చరించడం గమనార్హం. కేడర్‌ను కలుపుకొని పోవాలని సూచించినట్టు తెలిసింది. అయితే.. ఈయనకు కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు.
ఇక, సీమ ప్రాంతానికి చెందిన మరో మంత్రికి కూడా జగన్ హితవు పలికారు. "అన్నామీరు మాట్లాడుతున్నారు. కానీ, ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజలను కలవాలి" అని హితవుపలికినట్టుతెలిసింది. ఈయనను నియోజకవర్గం నుంచి మార్చుతూ తీసుకున్న నిర్ణయం తర్వాత.. ఆయన ఇంటికే పరిమితమవుతున్నారు. కొన్ని కొన్ని సార్లు దేవాలయాల్లో దర్శనమిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడం లేదు. అంతేకాదు.. "ఏదో చిన్నవాడిని.. నాపై పెద్దబాధ్యత మోపారు" అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కూడా జగన్ క్లాసు పీకారని సమాచారం. మొత్తంగా.. నలుగురి నుంచి ఐదుగురు మంత్రులకు సీరియస్‌గానే జగన్ కొన్ని విషయాలపై చర్చించారు.