జగన్‌కు కేంద్ర బలగాల భద్రత!
అయితే.. అనూహ్యంగా ఇప్పటి వరకు లేని విధంగా ఏపీ సీఎం జగన్ పర్యటనలో సీఆర్ పీఎఫ్ బలగాలు దర్శనమిచ్చాయి.
ఏపీ సీఎం జగన్ పర్యటనలో సహజంగా రాష్ట్ర పోలీసులే భద్రతగా ఉంటున్నారు. ఆయన చుట్టూ మఫ్టీలో 10 నుంచి 15 మంది, సాధారణ పోలీసు డ్రెస్‌లో మరికొందరు భద్రతగా ఉంటున్నారు. ఇది ఎక్కడైనా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి పోలీసులు కల్పించే భద్రతే. ఇదే.. ఇప్పటి వరకు ఏపీలోనూ కొనసాగుతోంది. అయితే.. అనూహ్యంగా ఇప్పటి వరకు లేని విధంగా ఏపీ సీఎం జగన్ పర్యటనలో సీఆర్ పీఎఫ్ బలగాలు దర్శనమిచ్చాయి. ఏకంగా నలుగురు(ముందు ఇద్దరు, వెనుక ఇద్దరు) సాయుధులైన సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది పెద్ద పెద్ద తుపాకులు పట్టుకుని కనిపించడం ఆశ్చర్యం కలిగించింది.
ఇప్పటి వరకు ఏపీలో చంద్రబాబుకు బ్లాక్ కమెండోలతో భద్రత కల్పించారు. ఆయనకు కూడా సీఆర్ పీఎఫ్ సిబ్బందినిఇవ్వలేదు. కానీ, జగన్‌కు మాత్రం అనూహ్యంగా ఇప్పుడు 2+2 సీఆర్ పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించడం గమనార్హం. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానిని స్వాగతించేందుకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు భద్రతగా ఉండాల్సిన లోకల్ పోలీసుల స్థానంలో సీఆర్ పీఎఫ్ సిబ్బంది కనిపించడం గమనార్హం.
ఇప్పటి వరకు జగన్‌కు సీఆర్ పీఎఫ్ భద్రతలేదు. అది కూడా అందరికీ కల్పించరు. చాలా చాలా తక్కువ మందికి.. అది కూడా కేంద్ర హోం శాఖ ఎంతో కసరత్తు చేసిన తర్వాతే.. ఈ భద్రత కల్పిస్తారు. మరి సీఎం జగన్‌కు ఈ భద్రతను ఇప్పుడు కల్పించడం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఆయన భద్రతకు రాష్ట్ర పోలీసులు ఉన్నా.. వారిని పక్కన పెట్టి మరీ.. జగన్‌కు ముందు ఇద్దరు, వెనుక ఇద్దరు సీఆర్ పీఎఫ్ సిబ్బంది సాయుధులై నడవడాన్ని బట్టి.. కేంద్రం కల్పించిన భారీ భద్రతగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
మరి దీనివెనుక ఉన్న అసలు విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా.. లోకల్ పోలీసులే చూసుకుంటారు. అలాంటి సీఆర్ పీఎఫ్ ఎందుకు వచ్చింది? కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది చర్చగా మారింది.