లడ్డూ వివాదం... జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Sep 2024 8:29 AM GMTఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేత జగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాజకీయాన్ని ప్రస్థావించారు.
అవును... ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఈ లడ్డూ వివాదం వెనుక భారతీయ జనతాపార్టీ కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారన్ని చూస్తుంటే... ఏపిలో బీజేపీ ఆట మొదలుపెట్టినట్లే అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొవాలని.. తిరుమల భక్తులకు భరోసా ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. తిరుమల లడ్డూ కల్తీ అయ్యిందన్న ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటనేది భక్తులకు స్పష్టం కావాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో అసలేం జరిగిందనేది మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని తెలిపారు.
ఈ వ్యవహారంలో జరిగిన అంశాల కంటే రాజకీయ లబ్ధి, మతపరమైన అంశాలపై చర్చ ఎక్కువగా జరుగుతుందని.. ఫలితంగా వాస్తవాలు మరుగున పడిపోతున్నాయని పేర్కొన్న జగ్గారెడ్డి.. వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని కోరారు. చంద్రబాబుతో కలిసి బీజేపీ ఏమైనా మతపరమైన రాజకీయాలకు తెరతీస్తుందా అనేది తన అనుమానమని పేర్కొన్నారు.
ప్రధానంగా దీనిపై విచారణ చేయకుండా చంద్రబాబు దీన్ని రాజకీయ చేయడం.. మత ప్రస్థావన తేవటం.. జగన్ పేరు ప్రస్థావన చేయటంతో వ్యక్తిగతంగా తనకు కొన్ని అనుమానాలున్నాయని.. ఎమోషనల్ గా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయడమే బీజేపీ ఎజెండా అని ఆయన విమర్శించారు.
ఇదే సమయంలో ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో పార్టీలకు అతీతంగా అంతా ఖండించామని చెప్పిన జగ్గారెడ్డి.. ఏపీలో భవిష్యత్తులో కాంగ్రెస్ కు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడతారనే నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన చేసిందనే కోపంతోనే గత మూడు ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మలేదని అన్నారు.