ఓడిపోతానని డిసెంబరు ఒకటినే రేవంత్ కు ఫోన్ చేసి చెప్పాడట

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన మార్కు వ్యాఖ్యల్ని చేశారు

Update: 2024-01-04 04:48 GMT

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన మార్కు వ్యాఖ్యల్ని చేశారు. ఆశ పెద్దది.. పీక చిన్నది అన్న చందంగా ఆయన తీరు ఉంటుందన్న సంగతి తెలిసిందే. తరచూ ఏదో ఒక రచ్చలో తన పేరు ఉండేలా వ్యవహరించే ఆయన.. పార్టీ విషయంలో కమిట్ మెంట్ ఉన్న నేతలా మాత్రం వ్యవహరించరన్న విమర్శల్ని తరచూ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మధ్య ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలు కావటం తెలిసిందే.

తన ఓటమి మీద ఇప్పటివరకు వ్యాఖ్యలు చేయని జగ్గారెడ్డి.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సంగారెడ్డిలో ఓడిపోతానని ఆర్నెల్ల ముందే తెలుసన్నారు. అంతేకాదు.. డిసెంబరు 1న రేవంత్ కు ఫోన్ చేసిన తాను.. ఎన్నికల్లో ఓడిపోనున్నట్లుగా చెప్పారన్నారు. ఇకపై తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనను ఓడించినందుకు బదులు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం విశేషం.

సంగారెడ్డిని వదిలేసి.. తాను రాష్ట్రం మొత్తం తిరుగుతానని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి మాటల్ని చూస్తే టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్లుగా చెప్పాలి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధిష్ఠానం ఏం చెబితే దాన్ని ఫాలో అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. తాను అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారాన్ని నమ్మిన సంగారెడ్డి ప్రజల్ని మళ్లీ తాను ఎందుకు ఓట్లు అడగాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సాధారణంగా తాను ఓడిన చోటు నుంచే తన సత్తా చాటుతానని.. తన ప్రజల మనసుల్ని దోచుకుంటానని నేతలు వ్యాఖ్యానించటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. అతగాడి తీరు చూస్తే.. చెరువు మీద అలిగిన సామెత గుర్తుకు వచ్చేలా ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఊరి మీద అలిగే కన్నా.. తనను గతంలో నమ్మిన ప్రజలు ఈసారి ఎందుకు నమ్మలేదన్న ఆత్మవిమర్శ చేసుకోవాలన్న చిన్న పాయింట్ ను పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జగ్గారెడ్డి మిస్ కావటం ఏమిటి?

Tags:    

Similar News