ఆయన 'జై' 'జై' శంకర్.. ఈ దిమ్మతిరిగే జవాబు చూడండి

దీనిపై మేం ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరిస్తాం.. ‘మీడియాతో’ కాదు.

Update: 2024-10-06 16:30 GMT

ప్రశ్న: ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి మీరు చమురు ఎందుకు కొంటున్నారు..?

జవాబు: మరి.. మీరు కూడా కొంటున్నారుగా..? మీరు చేస్తే తప్పు కానిది మేం చేస్తే తప్పా?

ప్రశ్న: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు.. మీరు ఆమెను ఎప్పుడు తిప్పి పంపుతున్నారు?

జవాబు: దీనిపై మేం ఆ దేశ ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరిస్తాం.. ‘మీడియాతో’ కాదు.

ప్రశ్న: కెనడాలో సిక్కు సంతతి వారి హత్యలపై వస్తున్న ఆరోపణల మీద మీ స్పందన ఏమిటి?

జవాబు: నేనేమీ అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కాదు..

ప్రశ్న: భారత్ తో పాకిస్థాన్ సంబంధాలు సాధారణ స్థాయికి ఎప్పుడు వస్తాయి?

జవాబు: ఇది సరైన మంత్రిని అడగడం లేదు. ఈ ప్రశ్న టెర్రరిజానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ మంత్రి ని అడగాలి.

పై ప్రశ్నలకు జవాబులు చూడండి.. ఎంత స్మార్ట్ గా ఉన్నాయో? వీటికి సమాధానం చెప్పాలంటే ఎంతటి చాతుర్యం కావాలి..? ఇవన్నీ ఏ సాధారణ వ్యక్తి చెప్పినవో కాదు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న నాయకుడు చెప్పినవి. ఆయనే డాక్టర్ జైశంకర్.

మోదీ రైట్ చాయిస్..

మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి ఎన్నో విమర్శలు ఉండొచ్చుగాక.. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయనను అందరూ మెచ్చుకుని తీరుతారు. అదే.. భారత విదేశాంగ మంత్రిగా జైశంకర్ నియామకం. 219 మేలో మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక జైశంకర్ అత్యున్నత బాధ్యతలు అప్పగించారు. మూడో విడతలోనూ జైశంకర్ అవే బాధ్యతలను కొనసాగించారు. దీన్నిబట్టే ఆయనపై మోదీకి ఎంతటి నమ్మకం ఉందో తెలిసిపోతుంది.

ఎన్నో సంక్షోభాలు.. సమర్థ నిర్వహణ

జైశంకర్ విదేశాంగ మంత్రి అయినాక పలు సంక్షోభాలు ఎదురయ్యాయి. చైనాతో గాల్వాన్ ఘర్షణ, ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర.. తాజాగా ఇజ్రాయెల్ తో హమాస్-హెజ్బొల్లా-ఇరాన్ యుద్ధం.. కానీ, వీటిని తనదైన విదేశాంగ విధానంతో భారత్ ఎదుర్కొంది. ఇందులో కీలక పాత్ర జైశంకర్ దే అని చెప్పడంలో సందేహం లేదు. అనేక విషయాల్లో జైశంకర్ ప్రపంచ వేదికల్లో భారత్ తరఫున తనదైన శైలిలో గట్టి జవాబులు ఇచ్చి అవతలి వారి నోరు మూయించారు. తాజాగా జైశంకర్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అయితే, ఆయన చెప్పిన జవాబు విన్నవారు అవాక్కయ్యారు.

వీరిలో ఎవరితో విందు?

‘‘ఉత్తర కొరియా అధినేత కిమ్, కుబేరుడు జార్జ్ సొరోస్.. వీరిద్దరిలో మీరు ఎవరితో విందు చేస్తారు?’’ అంటూ తాజాగా ఓ సదస్సులో జైశంకర్ కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘నేను ఇప్పుడు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఉన్నాను’’ అని. దీంతో సదస్సులో పాల్గొన్నవారంతా ఆశ్చర్యపోయారు. అందుకే సర్.. మీరు 40 ఏళ్లుగా దౌత్య రంగంలో రాణిస్తున్నారు అని మెచ్చుకున్నారు.

Tags:    

Similar News