జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభకు.. ఏం జరగబోతోంది..?

తాజాగా.. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు.

Update: 2024-12-14 10:30 GMT

లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బల్లును తీసుకొస్తోంది. ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతున్నా.. ఇప్పుడు మరో ముందడుగు పడింది. జమిలి ఎన్నికల బిల్లుపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఇప్పటికే రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా.. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించారు.

రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు వంద రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం జరగాల్సి ఉంది. దీనికి 50 శాతం రాష్ట్రాలు సైతం అంగీకారం తెలపాల్సి ఉంది. దాంతో ఆ బిల్లును పక్కనపెట్టినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల సైతం ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతోపాటు 50 శాతం రాష్ట్రాలు ఆమోదించాలి. అయితే.. ఈ జమిలి ఎన్నికలకు ఇప్పటికే 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. మరో 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందని ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే సోమవారం జమిలి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణలు చేయడానికి సైతం మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజ్యాంగం 83వ ఆర్టికల్ రాజ్యసభ పూర్తిగా రద్దు కాకుండా చూస్తుంది. 85వ అధికరణ పార్లమెంటును సమావేశ పర్చడం, సమావేశాలను ముగించడానికి సంబంధించిన ఆర్టికల్. ఏడాదిలో రెండు సార్లు అయినా పార్లమెంటును సమావేశపరచాలన్నది ఈ అధికరణ చెబుతున్నది. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి ప్రతిసారి రూ.4వేల కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల ఖర్చు వేరుగా ఉంది. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చులు కూడా తగ్గుతాయని కేంద్రం ఆలోచన చేసింది. ఎవరు వ్యతిరేకించినా.. ఎవరు అడ్డుకున్నా ప్రధాని మోడి మాత్రం జమిలి ఎన్నికలపై ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇక.. సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లలును లోక్‌సభలో ప్రవేశపెడుతారు. ఇప్పటివరకు రాజ్యాంగ సవరణ బిల్లు 129, కేంద్ర పాలిక ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లు 2024ను లోక్‌సభ ముందు పెట్టింది.

Tags:    

Similar News