జమ్మూకాశ్మీర్‌లో అంతుచిక్కని మరణాలపై విచారణ.. మెట్లబావి దగ్గర భద్రతా సిబ్బంది మోహరింపు
జమ్మూకాశ్మీర్‌లోని మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలోనే మృత్యువాత చెందడం సంచలనంగా మారింది
జమ్మూకాశ్మీర్‌లోని మారుమూల గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది స్వల్ప వ్యవధిలోనే మృత్యువాత చెందడం సంచలనంగా మారింది. ఈ మరణాలకు గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. దీనిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ మరణాలకు కారణంగా భావిస్తున్న మెట్ల బావి సమీప ప్రాంతాన్ని అధికారులు సీజ్ చేశారు.
బావిలోని నీటిలో పురుగులు మందుల ఆనవాళ్లు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్ల బావి దగ్గర 24 గంటలు భద్రతా సిబ్బందిని అధికారులు మోహరించారు. రాజోలి జిల్లాలోని భాదల్ గ్రామంలోని మెట్ల బావికి కంచె ఏర్పాటు చేయాలని, ముగ్గురు భద్రతా సిబ్బందిని 24 గంటలపాటు అక్కడ మొహరించాలని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. బాదల్ గ్రామంలోని బావి నుండి సేకరించిన నీటి నమూనాలలో పురుగుల మందుల ఉనికిని నిర్ధారించారు. దీంతో ఆ మెట్ల భావిని మూసివేయాలని నిర్ణయించారు.
ఈ మెట్ల బావిలో నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించకూడదని అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్ మీర్ ఆదేశించారు. బాధల్ గ్రామంలో మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అంతర్ మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ అస్లాం కుమార్తె యాస్మిన్ కౌసర్ కూడా అంతుచిక్కుని వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ 7-12 తేదీలు మధ్య గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇటీవల జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్ము కాశ్మీర్ ఆరోగ్యశాఖతోపాటు ఇతర విభాగాలు ఈ మరణాలపై దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఈ మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలివి రాలేదన్నారు. బాధితులు తొలుత జ్వరం, తలనొప్పి, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చారని, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే మృతి చెందారని మనోజ్ సిన్హా వివరించారు. ఈ రాష్ట్రంలో సంకలనంగా మారిన ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ నేపథ్యంలోనే మరణానికి కారణంగా భావిస్తున్న మెట్ల బావి వద్ద సిబ్బందిని మోహరించారు.