జనసేనలోకి బిగ్ షాట్ ?
జనసేన ఈసారి ప్లీనరీ మామూలుగా ఉండే చాన్సే లేదు అంటున్నారు. పార్టీలోకి భారీ జాయినింగ్స్ తో మోతెక్కించేలా ప్లాన్ చేశారు అని అంటున్నారు.;
జనసేన ఈసారి ప్లీనరీ మామూలుగా ఉండే చాన్సే లేదు అంటున్నారు. పార్టీలోకి భారీ జాయినింగ్స్ తో మోతెక్కించేలా ప్లాన్ చేశారు అని అంటున్నారు. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు జనసేనలో చేరుతారు అని అంటున్నారు.
ఆ లిస్ట్ లో మొదటి పేరుగా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఉన్నారని అంటున్నారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన రాఘవరావు ఒంగోలు జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా అలాగే 2014 నుంచి 2019 దాకా రవాణా శాఖ మంత్రిగా పనిచేసారు. ఆ మీదట 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.
అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2024లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసమే ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే దర్శిలో వైసీపీకి కీలక నేతగా జగన్ కి సన్నిహితుడు అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయనకే జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు కూడా.
ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీ ఓటమి తరువాత సిద్ధా రాఘవరావు చూపు కూటమి వైపు మళ్ళింది అని ప్రచారం సాగింది. విజయవాడలో గత ఏడాది వచ్చిన వరదల సందర్భంగా చంద్రబాబుని కలసి భూరి విరాళాన్ని ఆయన ఇచ్చారు దాంతో టీడీపీలో ఆయన చేరిక ఖాయమని అనుకున్నారు.
కానీ ఎందుకో అలా జరగలేదు. ఇక చూస్తే కనుక సిద్ధా రాఘవరావుని జనసేనలోనికి తీసుకుని వచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పావులు కదిపారు. ఆయన ఇటీవలనే చక్రం తిప్పి ఒంగోలు కార్పోరేషన్ ని జనసేన పరం చేయించారు. మూకుమ్మడిగా వైసీపీ కార్పోరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు.
ఇపుడు సిద్ధా రాఘవరావు వంటి బిగ్ షాట్ ని జనసేనలో చేర్పించడం ద్వారా జనసేన బలాన్ని నాలుగింతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అన్నీ కలసి వస్తున్న వేళ సిద్ధా రాఘవరావు జనసేన తీర్ధం పుచ్చుకోవడం ఖాయమైపోయింది. ఇక ఆయనతో పాటుగా మరింతమంది పెద్ద నాయకులు జనసేన ప్లీనరీలో పార్టీలో చేరుతారు అని అంటున్నారు.
ఒకనాడు ఒంగోలు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీకి ఈ పరిణామాలు ఒకింత ఇబ్బందిగా మారనున్నాయని అంటున్నారు. అయితే జగన్ కి సన్నిహిత బంధువు గా ఉన్న బాలినేని జనసేనలోకి చేరడంతో తన సత్తా చూపుతున్న క్రమంలో వైసీపీ నుంచే నాయకుల వలస మొదలైంది. మరి బాలినేని టార్గెట్లకు వైసీపీ ఎలా చెక్ చెబుతుందో చూడాల్సి ఉంది.