చక్రం తిప్పుతున్న బాలినేని.. చంద్రబాబు సన్నిహితుడినీ వదల్లేదు..

మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా పూర్తి యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీకి రాం రాం చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ఇప్పుడు ఆ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు.

Update: 2025-02-26 10:49 GMT

మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా పూర్తి యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీకి రాం రాం చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ఇప్పుడు ఆ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు. బాలినేని సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో జనసేనను బలమైన రాజకీయ శక్తిలా తీర్చిదిద్దేందుకు పావులు కదుపుతుండటం, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులను కూడా జనసేనలో చేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తుండటం ఇంట్రస్టింగ్ అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో జనసేన బలమైన రాజకీయశక్తిగా ఆవిర్భవించింది. 175 స్థానాలకు పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అదే సమయంలో పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 చోట్లా ఘన విజయం సాధించింది. దీంతో పలువురు వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకునేందుకు తహతహలాడుతున్నారు. వైసీపీకి భవిష్యత్ లేదన్న ఉద్దేశమో.. అధికార పార్టీలో ఉంటే పనులు చేయించుకోవచ్చన్న ఆలోచనో గానీ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారు, మంత్రి పదవులు నిర్వహించిన వారు సైతం వైసీపీకి గుడ్ చెప్పేస్తున్నారు. ఇలా బాలినేనితో సహా చాలా మంది నేతలు ఈ ఆరు నెలల కాలంలో వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇలా జనసేనలోకి వెళ్లిన వారంతా ఇప్పుడు ఆ పార్టీ కోసం పనిచేస్తుండటంతో వైసీపీ ఖాళీ అవుతోందని అంటున్నారు.

ప్రధానంగా వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ఎవరినీ వదలడం లేదని చెబుతున్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్పించిన ఆయన ఇప్పుడు తన ఫోకస్ ను పెద్ద లీడర్లపై పెట్టారంటున్నారు. ప్రధానంగా దర్శి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును జనసేనలోకి తెచ్చేందుకు బాలినేని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. 2014లో దర్శి నుంచి టీడీపీ తరఫున గెలిచి మంత్రి పదవి నిర్వహించిన శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. అందుకే ఆయన తొలిసారి గెలిచినా మంత్రి పదవి ఇచ్చారు. ఇక 2019లో పార్టీ ఓటమి తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో చాలా మంది నేతలు వైసీపీలోకి వెళ్లినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, శిద్ధా వెళ్లిపోతానంటే ఆయన చాలా బాధపడ్డారని చెబుతారు. తాను ఎంతో ప్రోత్సహించినా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోతానని చెప్పడం చంద్రబాబుకు ఆవేదనకు గురిచేసిందని అంటున్నారు.

ఇక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత శిద్ధా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని ప్రచారం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన శిద్ధాకు వైసీపీ చాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో ఆయన చేరికకు టీడీపీ తలుపులు తెరవలేదని అంటున్నారు. దీనివల్ల ప్రస్తుతం శిద్ధా రాజకీయంగా ఏకాకిగా మిగిలిపోయారంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై ఫోకస్ చేసిన బాలినేని.. జనసేనలోకి శిద్ధాను తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన చేరికపై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీలో శిద్ధా రాఘవరావు గ్లాసును అందుకుంటారని అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News