‘కత్తులు - నిప్పులు’.. చింతమనేని కోడిపందేల పై జనసేన మహిళా నేత ఫైర్!
దెందులూరులో చింతమనేని ఫ్లెక్సీ పెట్టి మరీ కోడి పందేలు ఆడిస్తున్నారని.. ఈ కోడి పందేల వల్ల తన తమ్ముడు చనిపోయాడని చెబుతూ... జనసేన మహిళా నేత వెంకటలక్ష్మి వాపోయారు.
సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో.. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి పీక్స్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే! అయితే.. ఒకప్పుడు వినోదంగా మాత్రమే ఉండే ఈ కోడి పందాల వ్యవహారం తర్వాత కాలంలో హింసాత్మకంగా, ఆర్థిక నష్టాల్లో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయే స్థాయికి మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ.. తమిళనాడులోని జెల్లకట్టుతో పోలిస్తూ కొంతమంది, ఇది సరదా అని ఇంకొంతమంది, గ్రామీణ క్రీడల్లో ఓ భాగం అన్నట్లుగా మరికొంతమంది వీటిని వెనకేసుకొస్తున్నారు.. ఏటా పరిధి పెంచుకుంటూ కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన మహిళా నేత నిప్పులు చెరిగారు. కోడిపందేల బరులపై మండి పడ్డారు.
అవును... దెందులూరులో చింతమనేని ఫ్లెక్సీ పెట్టి మరీ కోడి పందేలు ఆడిస్తున్నారని.. ఈ కోడి పందేల వల్ల తన తమ్ముడు చనిపోయాడని చెబుతూ... జనసేన మహిళా నేత వెంకటలక్ష్మి వాపోయారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా దెందులూరు ఎమ్మెల్యేపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగా.. ఇదే పేకాట, కోడి పందేల వల్ల తమ తమ్ముడు ఏడెకరాల పొలం అమ్మేసుకుని, ఆ నష్టాన్ని భరించలేక చనిపోయాడని తెలిపారు. కోడిపందేలు అనేవి సాంప్రదాయంగా జరుగుతున్నాయని చెబుతూ.. ఆ ముసుగులో పేకాట, గుండాట, కత్తులు కట్టి కోడి పందేలు హింసాత్మకంగా జరుగుతున్నాయని అన్నారు.
దెందులూరు ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతున్నాయో లేదో తనకు తెలియదు కానీ.. క్రికెట్ టోర్నమెంట్స్ లీగ్ లాగా చింతమనేని ప్రభాకర్ పేరు మీద కోడి పందేల లీగ్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారని.. తాము కూడా కూటమిలోనే ఉన్నామని.. ఇది ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుంటే వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ తరహా వ్యవహారలు కొంతమంది ఆనందం కోసం ఎంతో మంది జీవితాల్లో చీకటిని నింపుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్స్ తో సహా కలెక్టర్, ఎస్పీలతో పాటు డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రికి సైతం పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె వెళ్లడించారు. అయితే.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.
దీంతో.. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ వేయడం జరిగిందని.. 6వ తేదీన నెంబర్ వచ్చిందని, 7వ తేదీన జడ్జిమెంట్ కూడా వచ్చిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా.. గతంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అధికారులు అమలు చేయాలని తెలిపారని.. పేకాట, కోడి పందేలు, గుండాట వంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకూడదని తెలిపారని అన్నారు!
అయితే... దెందులూరు నియోజకవర్గంలో మాత్రం అవి అమలవ్వకుండా.. ఈ తరహా కోడి పందేలు, పేకాట వంటివి జరిపే దిశగా అడుగులు వేస్తున్నారని.. దీన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని జనసేన మహిళా నేత తెలిపారు. ఇది ప్రజల సమస్య అని.. ఈ కోడిపందేల లీగ్ లు ఆపాలని అన్నారు. ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు చెప్పాల్సింది పోయి మీరే ఇలాంటివి చేస్తే గనుక అది ప్రజలకు శ్రేయస్కరం కాదని చింతమనేనికి ఆమె తెలియజేశారు.