వైసీపీ నుంచి మునిసిపల్ పీఠం లాక్కున్న జనసేన

అయితే తాజాగా మారిన లెక్కలతో గాజు గ్లాస్ చేతిలోకి నిడదవోలు వచ్చేసింది. నిడదవోలులో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు జనసేనలోకి ఫిరాయించడంతో ఆ పార్టీకి బలం వచ్చింది.;

Update: 2025-04-12 17:29 GMT
వైసీపీ నుంచి మునిసిపల్ పీఠం లాక్కున్న జనసేన

ఏపీలో జనసేన గ్రౌండ్ లెవెల్ దాకా విస్తరిస్తోంది. 21 అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకున్న జనసేన ఇద్దరు ఎమ్మెల్సీలతో శాసనమండలిలోనూ గట్టిగానే బలం చాటుకుంది. ఇక అడుగు పెట్టాల్సింది రాజ్యసభలో. అది కూడా రానున్న కాలంలో జరుగుతుంది.

సరే అవన్నీ పక్కన పెడితే గ్రాస్ రూట్ లెవెల్ లో బలపడాలని జనసేన గట్టిగా తీర్మానించుకుంది. ఏపీలో పంచాయతీలు మున్సిపాలిటీలు మండలాలలో తన ఉనికిని బలంగా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ఎత్తులు ఫలించి ఆ పార్టీకి తొలి మునిసిపల్ పీఠం దక్కింది.

జనసేనకు బలం ఉన్న చోటనే ఈ అద్భుతం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు మునిసిపాలిటీ పీఠం జనసేన పరం అయింది. ఈ మునిసిపాలిటీకి 2021లో ఎన్నికలు జరిగినపుడు మొత్తం 28 సీట్లకు గానూ 27 వైసీపీకే దక్కాయి. ఒకే ఒకటి టీడీపీ గెలుచుకుంది. అంటే ఆనాడు జనసేన ఊసే ఈ మునిసిపాలిటీలో ఎక్కడా లేదు అన్న మాట.

అయితే తాజాగా మారిన లెక్కలతో గాజు గ్లాస్ చేతిలోకి నిడదవోలు వచ్చేసింది. నిడదవోలులో వైసీపీకి చెందిన కౌన్సిలర్లు జనసేనలోకి ఫిరాయించడంతో ఆ పార్టీకి బలం వచ్చింది. ఇదిలా ఉంటే గత నెల 28న వైసీపీకి చెందిన కౌన్సిలర్లు 17 మంది కలసి జనసేనలో చేరిన చైర్మన్ మీద అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అలా నోటీసు ఇచ్చిన వారిలో ముగ్గురు కౌన్సిలర్లు జనసేనలో చేరిపోవడంతో మున్సిపాలిటీలో ఆ పార్టీ బలం మెజారిటీకి చేరుకుని పీఠం ఆటోమేటిక్ గా దక్కింది.

ప్రస్తుతం జనసేనకు మునిసిపాలిటీలో 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీ కౌన్సిలర్ మద్దతు తో మెజారిటీని అందుకుంది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయి వైసీపీ కౌన్సిలర్లు తమ పార్టీలో చేరారు అని మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు.

జనసేన ఆధ్వర్యంలో నిడదవోలు మునిసిపాలిటీని అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. తమకు పట్టు ఉండి నూటికి 99 మంది తమ వారే అయి ఉన్న నిడదవోలు మున్సిపాలిటీ జనసేన పరం కావడం వైసీపీకి బిగ్ షాక్ అని అంటున్నారు.

గోదావరి జిల్లాలలో జనసేన విస్తరిస్తోంది. అదే సమయంలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఇక కీలక నేతలు అనదగిన వారు అంతా పార్టీని వీడిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలలో బలాబలాలు తారు మారు అవుతున్నాయని అంటున్నారు. మరి తన బలాన్ని గట్టిపరచుకునేందుకు వైసీపీ ఏమి చేయాలన్నది ఆలోచించుకోకపోతే గోదావరి జిల్లాలో వైసీపీ పడవకు రాజకీయంగా చిల్లు పడడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News