టైం ఉంది బ్రో.. గేట్లు తెరుస్తాం: జనసేనలో హాట్ టాపిక్..!
వైసీపీ నుంచి చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ.
జనసేన పార్టీలో చేరికలపై ఆ పార్టీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమయం చూసుకుని తమ అధి నేత గేట్లు తెరుస్తారని చెబుతున్నారు. వైసీపీ నుంచి చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా చక్రపాణి రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో చర్చకు వచ్చిన దరిమిలా.. ఆయనతోపాటు.. గుంటూరుకు చెందిన కీలక నాయకుడు కూడా.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని తెలిసింది.
గత ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన.. ఓడిపోయారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓడిపోయిన తర్వాత.. వైసీపీలో చులకనకు గురవుతున్నారన్నది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే జనసేన వైపు చూస్తున్నారు. పైగా.. తనకు ఇప్పుడు ఎక్కడ అవకాశం లేకుండా పోయిందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన లో చేరేందుకు రంగం రెడీ చేసుకుంటున్నా రు. కానీ, పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు.
మరోవైపు ఉత్తరాంధ్రలోనూ ఇద్దరు కీలక వైసీపీ నాయకుల వారసులు కూడా జనసేనకు జై కొట్టేందుకు రెడీ అయ్యారు. వారి విషయం కూడా పెండింగులోనే ఉంది. వారు వస్తామన్నా.. జనసేన నాయకులు తీసుకోవడం లేదు. తీసుకునేందుకునేందుకు ఇష్టం లేక కాదు.. కానీ పార్టీ అధినేత నుంచి ఇంకా తమకు ఎలాంటి సంకేతాలు రాలేదన్నది కీలక నాయకులు చెబుతున్న మాట. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని.. టైం వచ్చినప్పుడు.. ఖచ్చితంగా గేట్లు తెరుస్తారని అంటున్నారు.
ఏంటా టైం?
ప్రస్తుతం కూటమి సర్కారు పై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పెద్దగా వ్యతిరేకత రాలేదు. అలాగ ని.. అనుకూలత కూడా పెద్దగా లేదు. ఇలాంటి సమయంలో ఎవరికి అవకాశం ఇచ్చి చేర్చుకున్నా ప్రయోజనం ఉండదన్నది జనసేన ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో అనుకూలత పెరిగినప్పుడు.. నాయకులకు అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. టైం ఉంది.. బ్రో! అంటూ.. జనసేన నాయకులు వారిని బుజ్జగిస్తుండడం గమనార్హం.