వారాహి యాత్ర ఫలితం...జనసేనలో చేరికలు స్టార్ట్

ఆమంచి స్వాములుతో జనసేన శుభారంభానికి శ్రీకారం చుట్టింది అని అంటున్నారు.

Update: 2023-07-15 16:06 GMT

వారాహి రెండు విడతలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాలలో చేశారు. ఈ మధ్యలో విరామంతో కలుపుకుని నెల రోజుల పాటు సాగింది. ఒక విధంగా ఏపీ రాజకీయాలను హీటెక్కించింది. ఈ యాత్రతో పవన్ దిగజారి మాట్లాడారని వైసీపీ నుంచి సెటైర్లు పడ్డాయి కానీ పవన్ దూకుడు పెంచారని మరో వైపు ఆయనను అభిమానించే వారు అంటున్నారు.

ఏపీలో రెండే పార్టీలా మూడవది ఉండనక్కరలేదా అని భావినే వారు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరారు. మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ణి ఆయన కలసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

ప్రకాశం జిల్లాలో ఆమంచి క్రిష్ణమోహన్ గెలుపు వెనక స్వాములు ఉన్నారని అంటారు. గ్రౌండ్ లెవెల్ లో అన్నీ చక్కబెట్టే స్వాములు తమ్ముడు ఆమంచి క్రిష్ణమోహన్ నుంచి వేరుపడి వెళ్ళడం అంటే ఆశ్చర్యంగానే చూడాలి. ఆయన జనసేనలో చేరికతో అన్న స్వాములు అక్కడ తమ్ముడు క్రిష్ణమోహన్ వైసీపీలో అన్నట్లుగా కధ సాగుతోంది అన్న మాట.

ఆమంచి స్వాములుతో జనసేన శుభారంభానికి శ్రీకారం చుట్టింది అని అంటున్నారు. ఇక రేపో మాపో విశాఖ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరనున్నారని అంటున్నారు. ఆయన మంచి రోజు చూసుకుని జనసేనలోకే అని అనుచరులకు క్లారిటీ ఇచ్చేశారు.

ఇదే విశాఖ జిల్లా నుంచి మరి కొంత మంది నాయకులు కూడా జనసేన బాట పట్టనున్నారని అంటున్నారు. అదే విధంగా పవన్ వారాహి కదలిన గోదావరి జిల్లాల నుంచి కూడా చాలా మంది నేతలు ఇపుడు జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. జనసేనలో చేరే వారిలో పెద్ద లిస్ట్ గోదావరి జిల్లాల నుంచే ఉంటుంది అని అంటున్నారు.

ఎందుకంటే అక్కడే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది అని అంటున్నారు. అదే టైంలో జనసేన ఎక్కువగా సీట్లు పొత్తు ఉంటే తీసుకుని పోటీ చేయబోయేది కూడా ఇక్కడే అని తెలుస్తోంది. దాంతో అధికార పార్టీ నుంచే మొదట గోడ దూకుళ్ళు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఇపుడు ఆమంచి కానీ పంచకర్ల కానీ వైసీపీ నుంచే జనసేన వైపు నుంచే వచ్చి జనసేన బాట పడుతున్నారు. రానున్న కాలంలో సీటు మీద డౌట్ ఉన్న వారు గెలుపు మీద ఆశలు లేని వారు కూడా చాలా మంది జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పవన్ చాలా వాడిగా వేడిగా వారాహి యాత్ర వేళ అధికార పార్టీని పట్టుకుని మాట్లాడినా దుమ్ము దులిపేసినా చాలా మంది నేతలు వైసీపీలో సైలెంట్ గా ఉన్నారు. ఇపుడు వారంతా ఎందుకు ఉన్నారు అంటే తమ సేఫ్ జోన్ కోసమే అని అంటున్నారు.

మాటలు విసిరి చెడ్డ కాకుండా వారంతా మౌనంగా ఉంటూ తమ రాజకీయ దారిని గోదారి జిల్లాలలో వెతుక్కుంటారని అంటున్నారు. మొత్తంగా జరిగేది ఏంటి అంటే జనసేనలో ఇక ముందు ముమ్మరంగా చేరికలు ఉంటాయని, మరి ఇది వైసీపీతో పాటు టీడీపీకి కూడా షాకింగ్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే నాయకులను చేర్చుకుని సీట్ల కోసం బేరం పెట్టడానికి జనసేన రెడీగా ఉందిట.

Tags:    

Similar News