విశాఖ మీద జనసేన ఫోకస్... ఆయనే అధ్యక్షుడిగా...!
దానికి తగినట్లుగానే 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాలలో పదిహేను నుంచి ఇరవై వేలకు తగ్గకుండా ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. దాంతో జనసేన వచ్చే ఎన్నికల్లో విశాఖలో తన బలాన్ని మరింతగా పెంచుకుని పటిష్టం కావాలని చూస్తోంది.
విశాఖ జిల్లాను జనసేన తమకు బలమైన ప్రాంతంగా భావిస్తుంది. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల తరువాత అంతగా ఆదరణ ఉన్న జిల్లాగా చూస్తుంది. దానికి తగినట్లుగానే 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాలలో పదిహేను నుంచి ఇరవై వేలకు తగ్గకుండా ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. దాంతో జనసేన వచ్చే ఎన్నికల్లో విశాఖలో తన బలాన్ని మరింతగా పెంచుకుని పటిష్టం కావాలని చూస్తోంది.
ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఇటీవలనే ఆ పార్టీలో చేరిన పంచకర్ల రమేష్ బాబుని నియమించింది. పంచకర్ల కొద్ది నెలల క్రితం వరకూ వైసీపీకి విశాఖ ప్రెసిడెంట్ గా పనిచేశారు. దాని కంటే ముందు ఆయన టీడీపీ ఉన్నపుడు విశాఖ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేశారు.
అంటే పంచకర్లకు మొత్తం జిల్లా మీద రాజకీయ సామాజిక పరిస్థితుల మీద ఆ విధంగా అవగాహన ఉంది అని అంటున్నారు. ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. 2024 ఎన్నికల్లో విశాఖ జిల్లా పెందుర్తి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని పంచకర్ల చూస్తున్నారు.
ఇపుడు ఆయన హోదాను పెంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో పంచకర్లకు టికెట్ ఖాయమని అంటున్నారు జిల్లా ప్రెసిడెంట్ కే మొదట సీటు ఇస్తారు కాబట్టి అగ్ర తాంబూలం పంచకర్లకే అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి.
ఏజెన్సీ సీట్లను మినహాయిస్తే మిగిలిన పదమూడింటిలో కనీసంగా ఆరు సీట్లకు జనసేన పట్టుబట్టే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ఆయా సీట్లను కచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవడానికి జనసేన డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. భీమునిపట్నం, గాజువాక. విశాఖ నార్త్, పెందుర్తి, అలాగే అనకాపల్లి, ఎలమంచిలి.సీట్ల మీద జనసేన కన్ను ఉంది. ఇక అనకాపల్లి సీటు ఇవ్వకపోతే మాడుగుల అయినా లేక చోడవరం సీటు అయినా ఇవ్వాలని పట్టుబట్టనుంది అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే పంచకర్లకు జిల్లా పదవీ బాధ్యతలు అప్పగించడానికి కూడా కారణం ఉంది అని అంటున్నారు. ఆయన టీడీపీలో చాలా కాలం పనిచేసి ఉన్నారు. దాంతో ఆయనకు అక్కడ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. రేపటి రోజుల పొత్తు చర్చలకు కూడా చక్కగా ఒక కొలిక్కి తీసుకుని రాగలరు అని భావిస్తున్నారు. ఇక జనసేనకు ఇప్పటిదాకా విశాఖ వంటి జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ లేరు. ఇపుడు వస్తూనే పంచకర్లకు ఆ చాన్స్ ఇవ్వడంతో విశాఖ మీద జనసేన ఫోకస్ పెట్టినట్లే అంటున్నారు. రానున్న రోజులలో జన సేన టీడీపీ బంధాలు పంచదార పాలు మాదిరిగా ఉండాలంటే పంచకర్ల ఏమి చేస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.