పవన్ దూకుడు...టీడీపీ బేజారు...!

ఏపీ లో రాజకీయం ఇపుడు వైసీపీ వర్సెస్ టీడీపీ నుంచి వైసీపీ వర్సెస్ జనసేన గా మారుతోంది.

Update: 2023-07-17 08:21 GMT

ఏపీ లో రాజకీయం ఇపుడు వైసీపీ వర్సెస్ టీడీపీ నుంచి వైసీపీ వర్సెస్ జనసేన గా మారుతోంది. వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ జనం లోకి వచ్చినప్పటి నుంచి జనసేన వాయిస్ పెరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో జనసేన హడావుడు ఎక్కువ అయింది. పవన్ సభలు పెట్టి వైసీపీ ని ఎన్నడూ లేని విధంగా టార్గెట్ చేయడంతో దానికి ధీటుగా వైసీపీ రెస్పాండ్ కావడంతో ప్రధాన రాజకీయ ఫైటింగ్ ఆ రెండు పార్టీల మధ్య అన్న భావన కలుగుతోంది.

అదే టైం లో టీడీపీ కి జనసేన మిత్రపక్షం అవుతారో లేక ప్రత్యర్ధి పక్షం లో ఉంటారో తెలియక డైలమాల్లో ఉంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అదే ఇపుడు టీడీపీ కి ఇబ్బందిగా మారుతోందా అన్న చర్చ అయితే ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎపుడూ హైలెట్ గానే ఉంటుంది. దాని చుట్టూనే రాజకీయం అల్లుకుంటుంది. అదే టైం లో విపక్ష శిబిరం లో నిన్నటిదాకా టీడీపీ ఉన్న ప్లేస్ లోకి జనసేన దూసుకుని రావడం ఆ పార్టీయే తమకు అసలైన ప్రత్యర్ధి అన్నట్లుగా వైసీపీ కూడా ఢీ కొట్టడంతో ఏపీ రాజకీయం మొత్తం ఆ రెండు పార్టీల మధ్యనే టాక్ ఆఫ్ ది స్టేట్ అన్నట్లుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే పవన్ వ్యవహార శైలి కూడా టీడీపీకి ఏ మాత్రం అర్థం కాకుండా ఉంది అని అంటున్నారు. ఆయన వారాహి రెండవ దశ యాత్రను ప్రారంభించేముందు పార్టీ నేతల తో మాట్లాడుతూ పొత్తులు అన్నవి ఇపుడు అప్రస్తుతం, అవి ఉంటే కనుక తానే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం ద్వారా పొత్తుల విషయం లో ఈ రోజుకు అయితే ఎవరితోనూ ఏమీ లేదు అని తేల్చేశారు.

ఆ విధంగా చూస్తే ఇప్పటికి మూడు నాలుగు సార్లు టీడీపీ తో పవన్ భేటీకి ఏ మాత్రం అర్ధం లేకుండా పోయింది అని అంటున్నారు. అదే సమయం లో జనసేన లోకి చేరికల ను పవన్ ఆహ్వానిస్తున్నారు. వరసబెట్టి నేతలను ఆయన పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అవన్నీ కూడా టీడీపీ కి బలమైన నియోజకవర్గాలే కావడం విశేషం. చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆమంచి క్రిష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన లో చేరారు. అంటే చీరల మీద జనసేన కర్చీఫ్ వేసినట్లే అంటున్నారు.

ఇక పెందుర్తి సీటు వైసీపీ లో దక్కనందుకు అలిగి పార్టీ నుంచి బయ్టకు వచ్చేశారు అని ప్రచారంలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు జనసేన లో చేరుతున్నారు. ఆయన పెందుర్తి టికెట్ మీద ఏ మాత్రం హామీ ఇవ్వకుండా చేరరు అని రాజకీయాలు తెలిసిన వారు అంతా అనుకునే మాట. ఆ విధంగా చూస్తే కనుక పెందుర్తి సీటు మీద కూడా జనసేన కర్చీఫ్ వేసినట్లే అంటున్నారు.

ఉన్నట్లుండి ఇపుడు మరో మూడు నియోజకవర్గాలలో జనసేన ఇంచార్జిల ను పవన్ నియమించడం పట్ల టీడీపీ షాక్ అవుతోంది అని అంటున్నారు. గత పదేళ్ళ కాలం లో పవన్ ఎన్నడూ చేయని విధంగా ఇపుడు చేస్తున్నారు అని ఆ పార్టీ ఆలోచిస్తోంది. ఇదంతా కూడా పవన్ పాలిటిక్స్ లో ఎంత సీరియస్ గా ఉంటున్నారు అన్నది చెప్పేందుకే అని కూడా అంటున్నారు.

పవన్ పిఠాపురం రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల కు పవన్ జనసేన ఇంచార్జిలుగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, బత్తుల బలరమక్రిష్ణ, టీవీ రామారావుల ను ప్రకటించారు. ఇలా వీరి పేర్లను సడెన్ గా ప్రకటించడం అంటే వీరే వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్హ్దులు అని పవన్ ఇండైరెక్ట్ గా తెలియచేసినట్లే అంటున్నారు.

అదే విధంగా బ్రహ్మాండంగా జరిగిన తణుకు సభలో జనసేన అభ్యధిగా విడివాడ రామచంద్రరావు పేరు ని పవన్ ప్రకటించి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్ధిగా ఇప్పటికే మాజీ మంత్రి అరిమిల్లి రాధాక్రిష్ణ ఉన్నారు. అలాగే కొవ్వూరు నుంచి మాజీ మంత్రి జవహర్ ఉన్నారు. ఇక పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ముందున్నారు. రాజానగరం అభ్యర్ధిగా టీడీపీ లో గట్టి నేతలు చాలా మంది ఉన్నారు.

పైగా ఇవన్నీ కూడా టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాలు అలాంటి వాటి లో పవన్ వరసబెట్టి అభ్యర్ధులను ప్రకటించడమే కాదు, కొత్తగా నాయకుల ను చేర్చుకోవడం వారికి భరోసా ఇవ్వడంతోనే టీడీపీకి అసలు జనసేన ఆలోచనలు ఏమీ అర్ధం కావడంలేదు అని అంటున్నారు. రేపటి రోజున పొత్తులు కుదిరినా ఈ సీట్లను పవన్ ముందే ఇంచార్జిలను ప్రకటించారు కాబట్టి వాటిని వదిలేసుకోవాల్సిందేనా అన్న చర్చ వస్తోంది.

మరో వైపు టీడీపీ కూడా వరసబెట్టి అభ్యర్ధుల ను ఖరారు చేస్తూ చాలా చోట్ల మీరే పోటీలో ఉంటారని ఇండైరెక్ట్ గా చెబుతూ వస్తోంది. మరి జనసేనతో పొత్తుల తో సంబంధం లేకుండా టీడీపీ దూకుడు చేసినపుడు జనసేన చేస్తే తప్పేంటి అన్నది ఆ పార్టీ నుంచి వస్తోంది. రాజకీయాలు అంటే అలాగే ఉంటాయని, ఎవరు ఎవరి కోసమో తమను బలి పెట్టుకోవాల్సిన అవసరం లేదని జనసేన వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పవన్ దూకుడు మాత్రం టీడీపీ ని ఖంగు తినిపించేలా ఉందనే అంటున్నారు.

Tags:    

Similar News