పవన్ కళ్యాణ్ పీఎం అంట...పిచ్చి పీక్స్ నా ?
నిజమే వారి అభిమానం హద్దులు లేనిది. ఎల్లలు అంతకంటే లేనిది. ఎవరూ కాదనలేనిది. అయితే వాస్తవాలు కూడా చూసుకోవాలి కదా.
పవన్ కళ్యాణ్ కాబోయే ప్రధానమంత్రి. ఇది ఇపుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. జనసైనికులు పవన్ అభిమానులు అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. మా పవన్ దేశానికి పీఎం అని అంటున్నారు. నిజమే వారి అభిమానం హద్దులు లేనిది. ఎల్లలు అంతకంటే లేనిది. ఎవరూ కాదనలేనిది. అయితే వాస్తవాలు కూడా చూసుకోవాలి కదా.
పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటానికి అనుభవానికి తగిన పదవి ఉప ముఖ్య మంత్రి దక్కింది. టీడీపీ కూటమిలో పవన్ కి ఈ సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించారు. పవన్ కూడా ఇలా ఎమ్మెల్యే కాగానే అలా కీలక శాఖలకు మంత్రి అయిపోయారు. ఆ శాఖల మీద పట్టు సాధించే పనిలో పవన్ ఉన్నారు. చంద్రబాబు అనుభవం ఆయన నాయకత్వ పటిమను పవన్ కొనియాడుతూ వస్తున్నారు.
అయితే జనసేన మద్దతుదారులు అభిమానులు మాత్రం పవన్ ని ఇంకా రీల్ హీరోగానే చూస్తూ ఆయనను ఎక్కడో కూర్చోబెడుతున్నారు. రాజకీయాల్లో పదవులు ప్రజలు ఇవ్వాలి. వారు ఇస్తే వాటిని తీసుకుంటేనే అందం. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు కానీ వారు సీఎం అనే అంటున్నారు. అలా కోరుకోవడం తప్పు కాదు కానీ ఏకంగా పీఎం అంటే ఏమిటీ పిచ్చి పీక్స్ లోనా అని అనుకునేలాగానే ఉంది.
ప్రధాని పదవి అంటే ఆషామాషీ కాదు కదా అన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ని 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాలని ఫ్యాన్స్ కానీ జనసైనికులు కానీ ఆశ పడుతున్నారు. అయితే అది రాబోయే కాలం మీద జనసేన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఏపీ లాంటి స్టేట్ కి పవన్ ఏనాటికి అయినా సీఎం అవుతారు అంటే ఎవరూ అందులో ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ 29 రాష్ట్రాలతో అతి పెద్ద దేశంగా ఉన్న భారత్ కి పవన్ ప్రధాని అంటే దానికి కేవలం అభిమానుల ఆశ తప్ప ప్రాతిపదిక ఏదైనా ఉందా అన్నదే అంతా అంటున్న విషయం.
దాంతోనే ఇది కాస్తా సోషల్ మీడియాలో ఒక జోక్ గా మారిపోతోంది. జనసేన ఫ్యాన్స్ ఆశలను లైట్ తీసుకునేలా చేస్తోంది. ఆశలకు హద్దు ఉండాలి కదా అన్న మాటను అనిపిస్తోంది. నిజానికి ఈ మాటను అన్నది కూడా కాస్తా ప్రముఖుడే. ఆయనే జానీ మాస్టారు. ఆయన సినీ రంగంలో కొరియోగ్రాఫర్. పవన్ ఈ పుట్టిన రోజుకు డిప్యూటీ సీఎం. అదే పవన్ 2029 నాటికి ఆయన సీఎం, 2034 నాటికి ఈ దేశానికే పీఎం అని జానీ మాస్టార్ అన్నారు.
దీంతోనే అభిమానులు అంతా చప్పట్లు కొట్టారు, కేరింతలతో సందడి చేశారు. అయితే పవన్ ఉన్నత స్థానంలో చూడాలని అన్నా కూడా అది కాస్తా నమ్మబుల్ గా ఉండాలి కదా అని అంటున్నారు. ఈ దేశంలో జాతీయ పార్టీలే ఇపుడు ఇబ్బందులో ఉన్నాయి. రాహుల్ గాంధీ వంటి బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా ప్రధాని కోసం పదిహేనేళ్ళుగా తపస్సు చేస్తున్నారు. మరో వైపు బీజేపీ చేతిలో ఉన్న ప్రధాని పదవిని ఆ పార్టీ అంత సులువుగా వదులుకుంటుంది అంటే ఎవరూ మామూలుగా జరిగేదీ అని అనుకోరు.
ఇక చంద్రబాబు ఏపీకి ఈ దఫాతో నాలుగు సార్లు సీఎం గా చేసి ఇరవై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వారుగా ఉంటారు. దేశంలో బాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఇలా చూస్తే ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఒకవేళ ప్రధాని పదవి కూటమిలోని పార్టీలకు దక్కినా బాబు ముందు వరసలో ఉంటారు కదా అని అంటున్నారు. మరో వైపు చూస్తే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేలా జనసేన ఎదగాలని కోరుకోవడమూ మంచిదే.
దానికి తగిన సాధన ఇప్పటి నుంచే చేయడమూ మంచిదే. ఈసారి ఎన్నికల్లో జనసేన 21 సీట్లు మాత్రమే పోటీ చేసింది. చేసిన సీట్లు అన్నీ గెలిచింది. కానీ పోటీ చేయని గెలవని 154 సీట్ల మీద ముందు దృష్టి పెడితే బాగుంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు అన్నవి పదవుల కోసం కాదు ప్రజా సేవ కోసం అని పవన్ అంటూంటే అభిమానులు కానీ ఆ పార్టీని ఆరాధించే ప్రముఖులు కానీ ఇలాంటి వ్యాఖ్యలతో పవన్ రాజకీయ ప్రయాణాన్ని తగ్గించేస్తున్నారు అన్న భావన అయితే ఏర్పడుతోంది.
జనసేన ఇపుడు కూటమిలో ఉంది. అధికారంలో ఉంది. దాంతో అభిమానులు కూడా తగిన విధంగా మాట్లాడితేనే అందం అర్ధం అని అంటున్నారు. లేకపోతే పిచ్చి పీక్స్ కి చేరిందనే అనుకుంటారు అని సెటైర్లు అదే సోషల్ మీడియాలో పడుతున్నాయి.