బాలికతో అసభ్య ప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జరదొడ్డి సుధాకర్‌ పై పోలీసులు పోక్సో యాక్ట్‌ కింద కేసు పెట్టి అరెస్టు చేశారు.

Update: 2024-07-04 09:39 GMT

తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2019లో కోడుమూరు నుంచి వైసీపీ తరఫున జరదొడ్డి సుధాకర్‌ గెలుపొందారు. 2024లో జగన్‌ ఆయనకు సీటును కేటాయించలేదు. కోడుమూరు సీటును నాటి పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోదరుడు ఆదిమూలపు సతీశ్‌ కు ఇచ్చారు. అయితే సోదరులిద్దరూ ఎన్నికల్లో చిత్తుగా ఓడారు.

కాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికతో అనుచితంగా ప్రవ్తరించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో ఈ ఘటనపై ఇటీవల పోలీసులు ఆయనపై కేసు పెట్టారు.

ఈ నేపథ్యంలో కర్నూలులోని నివాసంలో ఉన్న జరదొడ్డి సుధాకర్‌ ను కర్నూలు టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వైద్యపరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సుధాకర్‌ ను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది.

ఇంట్లో పనిచేసే బాలికతో సుధాకర్‌ ప్రవర్తన వీడియో రూపంలో వెలుగుచూడటంతో ఆయనపై మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. ఎన్నికల ముందే ఈ వీడియో వెలుగు చూసింది. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆయనపై ఎలాంటి కేసు దాఖలు కాలేదు.

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జరదొడ్డి సుధాకర్‌ పై పోలీసులు పోక్సో యాక్ట్‌ కింద కేసు పెట్టి అరెస్టు చేశారు.

ఈ కేసులో బాధితురాలు మైనర్‌ కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. కాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అరెస్ట్‌ కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. గత ఎన్నికల్లో ఆయనకు సీటు రాకపోయినా వైసీపీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News