నాసా చీఫ్ గా అంతరిక్ష తొలి ప్రైవేటు వ్యోమగామి.. ట్రంప్ సంచలనం
అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈలోగానే తన సహచరులను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైక డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాల్లో ప్రత్యేకత చూపుతున్నారు. ఇప్పటికే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ)కి భారతీయ మూలాలున్న కాష్ పటేల్ (ఆకాశ్ పటేల్)ను చీఫ్ గా నియమించిన ట్రంప్.. ఇక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అధిపతిగా నియామకంలో తన ముద్ర చాటారు. అయితే, ఈసారి మరింతగా సంచలనం రేపారు.
అటు స్పేస్ ఎక్స్.. ఇటు నాసా
అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈలోగానే తన సహచరులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అధ్యక్ష బాధ్యతల్లో కూర్చునే వేళకు తనదైన టీమ్ ను తయారు చేసుకున్నట్లుగా అవుతుంది. అందులోభాగంగానే ఒక్కో నియామకం చేపడుతుంటారు. కాగా, ట్రంప్ గెలుపులో స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతోనే ఆయనకు కొత్త ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యం దక్కుతోంది. ట్రంప్ రూపకల్పన చేసిన డోజ్ ప్రాజెక్టుకు భారత సంతతి వివేక్ రామస్వామితో పాటు మస్క్ కూ బాధ్యతలు అప్పగించారు. డోజ్ అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ. దీనికి మస్క్, వివేక్ సంయుక్త సారథులు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పుడు మస్క్ సన్నిహితుడైన ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్ మెన్ ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తదుపరి చీఫ్ గా నామినేట్ చేశారు ట్రంప్. ఈయన బిలియనీర్. ‘షిఫ్ట్ 4 పేమెంట్స్’ కంపెనీ సీఈవో. కేవలం 41 ఏళ్లున్న ఐజాక్ మెన్.. స్పేస్ ఎక్స్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం, రాజకీయాలతో పెద్దగా పరిచయాలు లేని వ్యక్తి. కానీ, రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.
అంతరిక్షంలో తొలి స్పేస్ వాకర్..
కొంతకాలం కిందట వార్తల్లో నిలిచారు ఐజాక్ మెన్. ఎందుకంటే.. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామి కావడమే దీనికి కారణం. ఎలాన్ మస్క్.. వ్యాపార సహచరుడు కావడంతో ఈ ఎంపిక చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబరులో స్పేస్ ఎక్స్ సంస్థ ‘పొలారిస్ డాన్’ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ లో వెళ్లిన నలుగురిలో ఈయన ఒకరు. క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా.. అంతరిక్షంలో స్పేస్‌వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా అలా చరిత్రకెక్కారు. ఐజాక్ మెన్ కేవలం 16 ఏళ్ల వయసుకే ‘షిఫ్ట్ 4 పేమెంట్స్’ కంపెనీని ప్రారంభించారు.
స్పేప్ ఎక్స్ కార్యకాలాపాల్లోనూ ఆయనది కీలక పాత్ర. 2021లో ఇన్ఫిరేషన్ 4 ఆర్బిటల్ మిషన్ కు 200 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ కమాండర్ గా చేశారు. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.