జయదేవ్ సంచలన వ్యాఖ్యలు... లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా... రాజకీయాల నుచ్మి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు.

Update: 2024-01-28 12:48 GMT

రాజకీయాల నుంచి వైదొలగాలని గల్లా జయదేవ్ నిర్ణయంచుకున్నారన్న వార్తలు గతకొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆధివారం గుంటూరులో జరిగిన "కృతజ్ఞతాభివందనం సభ"లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా... రాజకీయాల నుచ్మి వైదొలుగుతున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు. ఇదే సమయంలో తాజా నిర్ణయం తాత్కాలికమేనని ఆయన చెప్పడం గమనార్హం.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని.. వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని.. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను కానీ, రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా అని జయదేవ్ వెల్లడించారు. అయితే అటు వ్యాపారాలు, ఇటు రాజకీయం రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుండటం వల్లే తాను రాజకీయాలను వదిలేస్తున్నా అని అన్నారు.

ఇదే క్రమంలో... రెండేళ్ల క్రితం తన తండ్రి వ్యాపారాల నుంచి రిటైర్‌ అయ్యారని.. దీంతో వ్యాపారాలు చూసుకోవాల్సిన బాధ్యతతో పాటు రాజకీయాలూ చూసుకోవడం తనవల్ల కావడం లేదని చెప్పిన జయదేవ్... ఎంపీగా ఉన్నన్నాళ్లూ రాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌ లో పోరాడినట్లు తెలిపారు. ఈ సమయంలో సీబీఐ, ఈడీ తన ఫోన్ లను ట్యాప్ చేస్తుందని.. తన వ్యాపారాలన్నీ నిఘా నీడలోనే ఉన్నాయని అన్నారు.

ఈ సమయంలో గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్న విషయంపై నారా లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా... రాజకీయంగా గల్లా జయదేవ్‌ ను మిస్‌ అవుతామని నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో మాట్లాడిన ఆయన... అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు.

అదేవిధంగా... రాజకీయాలకు తాత్కాలికంగా దూరమవుతున్నప్పటికీ... రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో... గల్లాజయదేవ్ కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ వెల్లడించారు. అనంతరం... రాజకీయాల్లో తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ లకు జయదేవ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News