రెండు జిల్లాలు.. ఇద్ద‌రు నేత‌లు.. వీరి సంగ‌తేంటో చూడు బాబు!

అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి, కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ రెడ్డి ఇద్దరూ కూడా తమకు ఎదురేలేదు అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.

Update: 2024-10-20 07:30 GMT

రెండు జిల్లాలు ఇద్దరు నేతలు టిడిపికి సెగ పెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ రెండు జిల్లాల్లో కేవలం ఇద్దరు నేతలను టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి, కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ రెడ్డి ఇద్దరూ కూడా తమకు ఎదురేలేదు అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. ఈ విషయం సొంత పార్టీలోనే చర్చకు వస్తోంది. ఇసుక, మద్యం విషయాల్లో తమకు కమిషన్లు ఇచ్చి తీరాల్సిందేనని జెసి దివాకర్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేశారు.

మీడియా మీటింగ్ పెట్టి మరి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఎవరు వ్యాపారం చేస్తారో వారంతా తమకు 20% కమిషన్ ఇచ్చి తీరాల్సిందేనని నియోజకవర్గ అభివృద్ధికి ఆ నిధులు ఖర్చు పెడతానని ఆయన చెప్పారు. అయితే దీనిపై టిడిపి నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగూ నిధులు ఇస్తుంది కాబట్టి ప్రత్యేకంగా కమిషన్లు వసూలు చేసేది ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వేధింపులు ప‌ర్వంలో పరాకాష్టగా మారిందని తాజాగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

ఇక భూమా అఖిలప్రియ అంతా తనదే అన్నట్టుగా తన నియోజకవర్గాన్ని వదిలేసి జిల్లా వ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతలైన ఎస్వీ మోహన్ రెడ్డి అదే విధంగా విజయ డైయిరీ చైర్మ‌న్‌గా ఉన్న జగన్మోహన్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీరిద్దరి పరిస్థితి కంట్రోల్ చేయకపోతే రెండు జిల్లాల్లో కూడా పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని స్థానిక నాయకులు తాజాగా చంద్రబాబు ముందు గోడు వెళ్ళబోసుకున్నారు.

మరి చంద్రబాబు వీరిద్దరిని కంట్రోల్ చేస్తారా లేక చూస్తూ కూర్చుంటారా అనేది చూడాలి. మరో చిత్రమైన విషయం ఏంటంటే వీరిద్దరికి వ్యక్తిగత వ్యక్తిగతంగా ఉన్న బలమైన ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదు. ఏదో పార్టీని పట్టుకుని బలంగా ఎదిగారే తప్ప వ్యక్తిగతంగా వీరికి బలాబలాలను చూస్తే గత ఎన్నికల్లో ఇరుప‌క్షాలు ఓడిపోయాయి, జెసి దివాకర్ రెడ్డి తనయుడు అస్మిత రెడ్డి 2019 ఎన్నికల్లో ఓడిపోతే, అదే ఎన్నికల్లో అఖిలప్రియ కూడా పరాజ‌యం పాలయ్యారు. కాబట్టి ఇలాంటివారిని చంద్రబాబు ఉపేక్షిస్తే స్థానికంగా మరింత మంది నాయకులు ఇలానే రెచ్చిపోతార‌ని సంకేతాలు వస్తున్నాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారనేది చూడాలి.

Tags:    

Similar News