బూడిద కాదది...తగ్గనంటున్న జేసీ !

బూడిద అని లైట్ తీసుకోవడానికి లేదు. ఆ బూడిద చాలా డబ్బుని తెచ్చిపెడుతుంది.

Update: 2024-12-03 04:10 GMT

బూడిద అని లైట్ తీసుకోవడానికి లేదు. ఆ బూడిద చాలా డబ్బుని తెచ్చిపెడుతుంది. కోట్లను తెస్తుంది. అంతే కాదు అది రాజకీయంగా కూడా తమ అనుచరులను పటిష్టం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఎక్కడా తగ్గేదే లేదని అంటున్నారని టాక్.

ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా అనంతపురం సీఎం హోదాలో వస్తే ప్రభాకరరెడ్డి వెళ్లలేదు. దాని కంటే ముందు పిలిచి మాట్లాడదామంటే కూడా వెళ్లలేదు. ఇక ఆయన కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యే అయిన అస్మిత్ రెడ్డిని పిలిచి బాబు చెప్పాల్సింది చెప్పేశారు.

పార్టీని బజారున పెట్టరాదని కూడా ఆయన గట్టిగానే ఆదేశించారు. అయితే అక్కడ ఉన్నది పేరుకు బూడిద అయినా దాని వెనక ఉన్నది డబ్బు. అందుకే ఆ కాంట్రాక్టుల కోసం జేసీ చూస్తున్నారని అంటున్నారు. తమ వారికి ఇప్పించుకుంటామని చెబుతున్నారని అంటున్నారు.

కడప ఆర్టీపీపీ బూడిత విషయంలో కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కాల్సిందే అన్నది ఆయన పట్టుదలగా ఉందని అంటున్నారు. ఇక ఈ విషయంలో తాను తప్పు చేయలేదని ఆయన బలంగా నమ్ముతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ ఎగుమతులపై ఇంకా సస్పెన్స్ అలా సాగుతొంది.

ఇదిలా ఉంటే ఈ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో జేసీ డైరెక్ట్ ఫైట్ కి రెడీ అంటున్నారు. అక్కడ ఆదినారాయణరెడ్డి కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆయన కూడా పట్టుదల మనిషే. ఇలా ఇద్దరు నేతలూ వెనక్కి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చుంటే కూటమికే ఇబ్బంది అని అంటున్నారు.

జేసీ ప్రభాకరరెడ్డి అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు అనేక పోరాటాలు చేశామని ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేస్తున్నారు. ఇపుడు మంచి రోజులు వచ్చాయని తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన అంటున్నారు. అయినా సరే ఈ తగ్గమని అంటే ఎలా అని ఆయన తన సన్నిహితులతో అంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇక్కడ చిక్కుముడి ఏంటి అంటే కడప జిల్లాలో ఆర్టీపీపీ ఉండగా, సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రం జేసీ సొంత ఏరియా అయిన తాడిపత్రిలో ఉంది. దాంతో ఇద్దరికీ ఆధిపత్యం ఉందని అంటున్నారు. తామే బూడిదను ఎగుమతి చేస్తామని రెండు వర్గాలు పోటీ పడుతున్న నేపధ్యం ఉంది.

అయితే బూడిద రాజకీయం ఇపుడే ఏమీ కాదని గతంలోనూ ఉందని అంటున్నారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో జమ్మలమడుగు తాడిపత్రి ఎమ్మెల్యేలు ఇద్దరూ బూడిద విషయంలో పరస్పరం అంగీకారం అయి పంచుకున్నారని అంటున్నారు.

అయితే ఇపుడు పంచుకోవడం కాదు సొంతం మాకే అని ఇద్దరు రెడ్లూ పట్టుబట్టి కూర్చుకున్నారు. దాంతోనే వివాదం వస్తోంది అని అంటున్నారు. పైగా బూడిద ఎగుమతి విషయంలో ఆదాయం పెద్ద ఎత్తున వస్తోందని అంటున్నారు. ఇదే ఇపుడు తెగేదాకా లాగెలా ఉందని అంటున్నారు.ఇకపోతే ఇద్దరూ కూటమిలో ఉన్నా జేసీ టీడీపీ అయితే ఆది నారాయణరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇలా ఇద్దరూ పంతానికి పోతే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు. అపుడు కాంట్రాక్టులు ఎవరికీ దక్కకుండా పోయినా పోతాయని కూడా చెబుతున్నారు. అయితే తన పలుకుబడితో ఎలాగైనా ఈ కాంట్రాక్టులు తెచ్చుకునేందుకే జేసీ చూస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News