ముదురుతున్న జేసీ, బీజేపీ వివాదం.. కూటమి ఏం చేస్తుందో?
రాష్ట్రమంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వయసుకు తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు. ఆయన బస్సు కాలిపోతే బీజేపీకి ఏం సంబంధం అని నిలదీశారు.
అధికార పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మధ్య వివాదం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ మహిళా నాయకులను ఉద్దేశించి జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జేసీ వ్యాఖ్యలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ తప్పుపట్టారు. అదేవిధంగా బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు కూడా జేసీ తీరును ఖండించారు.
తాడిపత్రిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు టీడీపీ, బీజేపీ మధ్య రచ్చకు దారితీస్తోంది. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మాత్రమేనంటూ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించడం, ఆ వేడుకపై బీజేపీ మహిళా నేతలు యామినీ శర్మ, మాధవీలత విమర్శలు చేయడంతో జేసీ ఫైర్ అయ్యారు. ఇద్దరు మహిళా నాయకులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. సినీ నటి అయిన మాధవీలతను ప్రాస్టిట్యూట్ అంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రమంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వయసుకు తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు. ఆయన బస్సు కాలిపోతే బీజేపీకి ఏం సంబంధం అని నిలదీశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మంచి పాలన అందిస్తున్నాయని చెప్పారు. జేసీ వ్యక్తిగత విషయాలను రాష్ట్రానికి సంబంధించిన విషయంగా మాట్లాడటం విచారకరమన్నారు. అర్థం పర్థంలేని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. జేసీ వ్యాపారాలపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి, వాటి విషయంలోకి మేము వెళ్లదలచుకోలేదు.
కానీ, జేసీ ఇలా మట్లాడటం సరికాదంటూ మంత్రి సత్యకుమార్ హితవు పలికారు. అదేవిధంగా అనంతపురం బీజేపీ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసులు సైతం జేసీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళానేత మాధవీలతపై జేసీ కామెంట్స్ జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. అధికార పార్టీలో ఉంటూ ఏం మాట్లాడుతున్నారో జేసీ గ్రహించాలి. మీ వయసు పెద్దది. వయసుకు తగ్గట్టే ప్రవర్తన ఉండాలి. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా నడుచుకోవద్దని హితవు పలికారు.