బీజేపీ మహిళా నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో తన బస్సులు అడ్డుకుంటే, బీజేపీ ప్రభుత్వంలో కావాలని కాల్చేస్తున్నారని ఆరోపించారు.

Update: 2025-01-03 07:22 GMT

అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కేసు రాజకీయ మలుపులు తిరుగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు ఎలా కాలిపోయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీ నేతలపై భగ్గుమనడం రాజకీయంగా అగ్గి పుట్టిస్తోంది.

బుధవారం రాత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు కాలిపోయింది. ఈ సంఘటనపై ఫిర్యాదు చేయమని పోలీసులు కోరితే తిరస్కరించిన జేసీ.. మీరు సుమోటాగా కేసు నమోదు చేసుకోవాలని పోలీసులకు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో తన బస్సులు అడ్డుకుంటే, బీజేపీ ప్రభుత్వంలో కావాలని కాల్చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జగనే నయమంటూ ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

జేసీ వ్యాఖ్యలతో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ఆగ్రహాగ్నికి కారణమేంటంటూ ఆరా తీశారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలను జేసీ నిర్వహిస్తే.. బీజేపీ మహిళా నేతలు ఆ వేడుకలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడంతో జేసీ ప్రభాకర్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు. బీజేపీ మహిళా నేతలు సినీ నటి మాధవీలతతోపాటు యామినీ శర్మపై విమర్శలు గుప్పించిన జేసీ, మాధవీలతపై ఒకింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాడిపత్రి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బస్సు కాలిపోతే ఆ ప్రమాదం ఎలా జరిగింది? అందుకు బాధ్యులు ఎవరు అన్న విషయాలను వదిలేసి మిత్రపక్షంపై టీడీపీ నేత జేసీ చిర్రుబుర్రులాడటం కూటమిలో కుదుపు తెచ్చింది. ఇప్పటికే బీజేపీలో చేరికలపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జేసీ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించేలా చేశాయంటున్నారు.

Tags:    

Similar News