పెద్దారెడ్డి పై జేసీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు విజ్ఞప్తులు!

తాజాగా తాడిపత్రి మున్సిపల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంతకైనా తెగిస్తాడని

Update: 2024-07-20 09:52 GMT

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి - కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం ఏ స్థాయిలో చర్చనీయాంశమైన టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఇద్దరి మధ్యా మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతుంటాయి. పంచెలూడదీసి కొడతానని ఒకరంటే... అంత సీన్ లేదని మరొకరు అంటుంటారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపీ - టీడీపీ - జనసేలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్పందించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ఇంకా మరిచిపోలేదని అన్నారు.

ఇదే సమయంలో.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తాడిపత్రి మున్సిపల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంతకైనా తెగిస్తాడని.. అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి మనవిచేశారు.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుటుంబం మీద పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని.. ఆ తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన ప్రతీ సమావేశంలో తమ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. కేతిరెడ్డి పెద్దరెడ్డి ఎంతకైనా తెగించే వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసు అని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో మమ్మల్ని బెదిరించడమే కాకుండా.. ఫ్యాక్షన్ రాజకీయాలు వదిలిపెట్టను అని చెప్పిన కేతిరెడ్డి పెద్దారెడ్డితో తనకు, తనతోపాటు తాడిపత్రి ప్రజానికానికీ ప్రాణహాని ఉందని.. పెద్దారెడ్డి మనుషులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే పెద్దారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని అన్నారు.

Tags:    

Similar News