అల్లుడుగారొస్తున్నారు..ఉషతో కలిసి భారత్ కు వాన్స్..టూర్ ఎప్పుడో?

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలుగించి అల్లుడు అనే సంగతి తెలిసిందే. ఈయన భార్య ఉషా చిలుకూరి కుటుంబం క్రిష్ణా జిల్లాకు చెందినది.;

Update: 2025-03-12 11:30 GMT

అల్లుడంటే భారత సమాజంలో ఆ మర్యాదే వేరు.. ఇంట్లో పులిలా ఉండే మామ గారు సైతం అల్లుడు వస్తే మామూలు అయిపోతారు.. సంప్రదాయ భారత కుటుంబ వ్యవస్థలో ఉన్న విలువ ఇది. మరి అల్లుడు గారు అమెరికాకు ఉపాధ్యక్షుడు అయితే.. భవిష్యత్ లో అధ్యక్షుడూ కూడా కాబోయే వారైతే..

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తెలుగించి అల్లుడు అనే సంగతి తెలిసిందే. ఈయన భార్య ఉషా చిలుకూరి కుటుంబం క్రిష్ణా జిల్లాకు చెందినది. కొన్నిదశాబ్దాల కిందట వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతులైన ఉషా కుటుంబ సభ్యులు ఉన్నత ఉద్యోగాలు కూడా చేశారు.

ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ (క్రిష్) చిలుకూరి, లక్ష్మి చిలుకూరి ఇద్దరూ ప్రొఫెసర్లు. వీరిది కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఉషా పుట్టారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధ వ్యవహారాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. ఇక

ఉషా యేల్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రురాలయ్యారు. అక్కడే జేడీ వాన్స్‌ పరిచయం అయ్యారు. ఇది ప్రేమగా మారింది. 2014లో కెంటకీలో వివాహం చేసుకున్నారు. అదికూడా హిందూ సంప్రదాయంలో కావడం విశేషం. వీరికి ముగ్గురు పిల్లలు. రాజకీయాల్లో వాన్స్‌ కు ఉష అడుగడుగునా అండగా నిలిచారు. నిరుడు నవంబరులో జరిగిన ఎన్నికల సమయంలోనూ వాన్స్‌ తరఫున చురుగ్గా ప్రచారం చేశారు.

ఇప్పుడు ఉషా, వాన్స్ జంట ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ఆరంభంలో భారత్‌ లో పర్యటించనున్నట్లు సమాచారం. అమెరికా మీడియా వర్గాలే ఈ మేరకు కథనం ఇచ్చాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అత్యంత నమ్మకస్తుడైన జేడీ వాన్స్.. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోనూ చర్చల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

వాన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలు అందుకున్న తర్వాత రెండో విదేశీ పర్యటన మన దేశమే. ఫిబ్రవరిలో ఆయన ఫ్రాన్స్‌, జర్మనీల్లో పర్యటించారు. మరోవైపు ఉషా అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో తన పూర్వీకుల దేశానికి రానుండటం ఇదే తొలిసారి.

Tags:    

Similar News