వైసీపీలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఇదిగో క్లారిటీ!

అవును... తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే.

Update: 2023-10-30 05:20 GMT

తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు శ్రీశైలం వెళ్లిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలుసుకోవడం.. అనంతరం వైఎస్ జగన్ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించడం.. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఫలితం కూడా అదేస్థాయిలో ఉంటుందని ప్రోత్సహించడం వంటి మాటలు మాట్లాడిన సంగతీ తెలిసిందే. దీంతో లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారంటూ కథనాలు రావడం మొదలైంది. వీటిపై మాజీ జేడీ స్పందించారు.

అవును... తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. అదే సమయంలో "జగనన్న ఆరోగ్య సురక్ష" ప్రోగ్రాం జరుగుతుండగా అందులో పాల్గొన్న జేడీ.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... "నాడు–నేడు" కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని చెప్పిన లక్ష్మీనారాయణ... అంగన్వాడీలలో చిన్న పిల్లలకు పౌష్టికాహారం రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు.

ఇదే సమయంలో... "జగనన్న ఆరోగ్య సురక్ష" మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో.. వారికి అదే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని తెలిపారు. గతంలో జగన్ ను వివిధ కేసులలో అరెస్టు చేసిన సీబీఐ మాజీ జేడీ... అదే జగన్ పరిపాలనను అభినందించడం, ఆదర్శమన్నట్లుగా చెప్పడంపై పట్ల సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ జేడీ... వైసీపీలో జాయిన్ అవుతున్నారనే కథనాలు హల్ చల్ చేశాయి.

దీంతో ఈ ప్రచారంపై ఎక్స్‌ క్లారిటీ ఇచ్చారు లక్ష్మీనారాయణ. ఇందులో భాగంగా... వైసీపీలో చేరుతున్నానే ఊహాగానాలలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఇదే క్రమంలో... ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అదేవిధంగా... ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా... "శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను" అని లక్ష్మీనారాయణ తెలిపారు.

అనంతరం... "అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు... ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నాను" అని ట్విట్టర్ లో తెలిపారు.

Tags:    

Similar News