కాంగ్రెస్ లో సీనియారిటీకి గుర్తింపు లేదు.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి సంచలన ప్రకటన

కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.;

Update: 2025-04-15 11:18 GMT
కాంగ్రెస్ లో సీనియారిటీకి గుర్తింపు లేదు.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి సంచలన ప్రకటన

కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు గట్టిగా బ్రేక్ వేశారు.

"పార్టీ మారే ఆలోచన ఎంతమాత్రం లేదు. ఇది కేవలం ఊహాగానం మాత్రమే" అని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తనకున్న సీనియారిటీని గుర్తు చేశారు. "వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్‌ను. జానారెడ్డి గారు కూడా నా తర్వాత నాలుగేళ్లకు పార్టీలో చేరారు" అని ఆయన అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని, అయితే దాని కారణంగా పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే జీవన్ రెడ్డి తన అసంతృప్తిని కూడా బహిరంగంగా వెల్లడించారు. "నేను అసంతృప్తితోనే ఉన్నాను. నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన ఏకైక శాసనసభ్యుడిని తానేనని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. "గత 40 ఏళ్లుగా నేను అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నేను అనేలా పార్టీని బలోపేతం చేశాను" అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో తాను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒంటరిగా పోరాడానని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశానుసారం రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇటీవల మంత్రి పదవులు ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుల ప్రయత్నాలను జీవన్ రెడ్డి సమర్థించారు. మంత్రి పదవులు ఆశించడంలో వారి తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తానికి జీవన్ రెడ్డి తన పార్టీ మారే ఊహాగానాలకు తెర దించుతూనే.. పార్టీలో తనకున్న అసంతృప్తిని, సీనియారిటీకి లభించని గౌరవాన్ని బహిరంగంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Full View
Tags:    

Similar News