జీవన్‌ రెడ్డి సంచలన నిర్ణయం!

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కుదుపుకు కారణమైన సంగతి తెలిసిందే.

Update: 2024-06-25 07:14 GMT

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కుదుపుకు కారణమైన సంగతి తెలిసిందే. తాను గతంలో పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ లో చేరడం జీవన్‌ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. తనను మాట మాత్రం అడగలేదని జీవన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని జీవన్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానన్నారు. తన భవిష్యత్‌ కార్యాచరణపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరగాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ నుంచి ఇంకా తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గౌరవించానని.. అయినా తనకు పార్టీలో గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా జగిత్యాల నుంచి జీవన్‌ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి 1983లో టీడీపీ తరఫున గెలుపొందారు. 1989, 1996, 1999, 2004, 2014ల్లో కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. 1985, 1994, 2009, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగానూ పనిచేశారు. ఇటీవల నిజామాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

కాంగ్రెస్‌ లో పాతతరం నేత అయిన జీవన్‌ రెడ్డి పార్టీ మారతారనే వార్తల నేపథ్యంలో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ.. జీవన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారని తెలుస్తోంది. తాను హైదరాబాద్‌ కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం.

మరోవైపు కరీంనగర్‌ జిల్లాకే చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌.. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు నచ్చచెప్పారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయనతో మాట్లాడి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

మరోవైపు జీవన్‌ రెడ్డి రాజీనామా వార్తలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు. తాము సైతం జీవన్‌ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటామని వారు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానంతోపాటు మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు మాట్లాడినా జీవన్‌ రెడ్డి మెత్తబడనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికే ఆయన నిర్ణయించుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News