ఔరా జీవన్ రెడ్డి ? ఆర్టీసీ మాల్ కు రూ.7 కోట్ల బకాయిలు.. కరెంట్ కట్!

ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లు చేరినా జీవన్ రెడ్డి మాత్రం వాటిని చెల్లించలేదు. దీంతో.. సంస్థకు అధికారులు లీజు నోటీసులు ఇచ్చారు.

Update: 2023-12-08 04:23 GMT

మీ ఇంటి కరెంటు బిల్లు రూ.వెయ్యి అనుకుందాం. పొరపాటున కట్టాల్సిన విద్యుత్ బిల్లు కట్టలేదని అనుకుందాం. ఏం జరుగుతుంది? ఉన్నట్లుండి ఊడిపడటమే కాదు.. చెప్పాపెట్టకుండా విద్యుత్ కట్ చేస్తారు. పొరపాటు జరిగిందండి.. కట్ చేసే ముందు కాస్త చెప్పొచ్చుగా? అంటే.. టైంకు కట్టాల్సిన బాధ్యత నీకు లేదా? అంటూరివర్పు కావటం తెలిసిందే. అలాంటిది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే పెద్దమనిషి జీవన్ రెడ్డికి చెందిన మాల్ కు రూ.2 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. అంతేనా.. ఆర్టీసీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో భారీ మాల్ కట్టేసిన ఆయన.. దానికి సంబంధించి ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.7 కోట్ల అద్దెల్నిఇప్పటివరకు కట్టింది లేదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే.. ఆయా శాఖలకు చెందిన అధికారులకు ఒక్కసారి ధైర్యం వచ్చేసింది. ఇంతకాలం జీవన్ రెడ్డి దగ్గర నుంచి బకాయిలు వసూలు చేసే ధైర్యం లేని ఆర్టీసీ.. విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చేశారు. అంతేకాదు.. విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.అసలేం జరిగిందంటే.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఆనుకొని ఆర్టీసీకి చెందిన దాదాపు 7వేల చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడో భారీ మాల్ ను నిర్మించారు. అనేక దుకాణాలతోపాటు పీవీఆర్ మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లు చేరినా జీవన్ రెడ్డి మాత్రం వాటిని చెల్లించలేదు. దీంతో.. సంస్థకు అధికారులు లీజు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ స్పందించకపోవటంతో గురువారం ఆర్టీసీ సిబ్బంది మాల్ వద్దకు వెళ్లి.. మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాల్ని వెల్లడించారు.

వెంటనే బకాయిల్ని చెల్లించనిపక్షంలో స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరికలు చేశారు. ఈ విషయాల్ని మాల్ లో షాపుల్ని అద్దెకు తీసుకున్న వారు గమనించాలని కోరారు. మరోవైపు.. విద్యుత్ బిల్లుల బకాయిలు ఏకంగా రూ.2.5 కోట్లు చేరినా తిరిగి చెల్లించలేదు. బకాయిల చెల్లింపుల కోసం నోటీసులు పంపుతున్నా స్పందించకపోవటంతో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News