భారత్ లో సీఐఏ డెన్ లు.. ఆ 2 నగరాల్లో పాగా

అధ్యక్షుడు ట్రంప్ మాత్రం.. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసు ఫైల్స్ ను బయటపెట్టాలనే లక్ష్యంతో ఉన్నారు.;

Update: 2025-03-20 07:15 GMT

గత 190 ఏళ్లలో హత్యకు గురైన అమెరికా అధ్యక్షులు నలుగురు. వీరిలో మొదటివారు అబ్రహం లింకన్ (1865), తర్వాతి జేమ్స్ గారీఫీల్డ్ (1881), విలియం మెకిన్లీ (1901), చివరగా జాన్ ఎఫ్ కెన్నడీ (1963). అంటే 62 ఏళ్ల కిందట జరిగింది కెన్నడీ హత్య. ఆ తర్వాత మరెప్పుడు అమెరికా అధ్యక్షుడు హత్యకు గురికాలేదు. 1981లో రోనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగినా ఆయన బతికి బట్టకట్టారు. అయితే, ప్రస్తుత

అధ్యక్షుడు ట్రంప్ మాత్రం.. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసు ఫైల్స్ ను బయటపెట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్నే గట్టిగా ప్రస్తావించారు.

కెన్నడీ హత్యకు సంబంధించిన కీలకమైన ఫైల్స్‌ ను తాజాగా ట్రంప్‌ సర్కారు బయటపెట్టేసింది. అయితే, ఇందులో అమెరికన్ సీక్రెట్ సర్వీస్ (సీఐఏ) పాత్ర ఉందని పేర్కొనడంతో కలకలం రేగుతోంది. అంతేకాదు..

భారత్‌ లో అమెరికా ఒకప్పుడు సీఐఏ స్థావరాలను కూడా నిర్వహించిందని బయటపడింది. దీనిని రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్‌ ఎక్స్‌ లో పోస్ట్ చేసింది.

రాజధానితో పాటు..

దేశ రాజధాని న్యూ ఢిల్లీతో పాటు మరో ప్రధాన నగరః, కోల్‌ కతాలో సీఐఏ స్ధావరాలు ఏర్పాటు చేసిందట. వీటిని బ్లాక్‌ సైట్స్‌ అని పిలిచేవారట. వీటిని అనుమానాస్పద వ్యక్తులను బంధించడంతో సహా పలు రహస్య ఆపరేషన్లకు వాడేవారట.

కాగా, రష్యా సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం చూస్తే భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో సీఐఏకు గతంలో స్థావరాలున్నట్లు తేలింది.

మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌ కు చెందిన రావల్ఫిండి, శ్రీలంకలోని కొలంబో, ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌, దక్షిణ కొరియాలోని సియోల్‌, జపాన్‌లోని టోక్యో వంటి నగరాల పేర్లున్నాయి.

కాగా, 2013లోనూ సీఐఏకు సంబంధించి భారత్‌లో కార్యకలాపాలు జరిగినట్లు కథనాలు వచ్చాయి. భారత ప్రభుత్వమే ఒడిశాలోని చార్బాటియా ఎయిర్‌ బేస్‌ ను వాడుకొనేందుకు అమెరికాకు అనుమతించినట్లు చెప్పారు. అయితే, చైనాతో యుద్ధం సమయంలో 1962లో చైనా భూభాగంపై నిఘా కోసం సీఐఏకు చెందిన యూ-2 విమానం రీఫ్యూయలింగ్‌ కోసం దీనిని వాడారని పేర్కొంది. వాస్తవానికి ఆ ఎయిర్‌బేస్‌ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు.

ట్రంప్‌ ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు విడుదల చేసిన కెన్నడీ హత్య దర్యాప్తు ఫైల్స్‌ లో సీఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. మొత్తం 63 వేల పేజీలు 2,200 ఫైల్స్‌ రూపంలో ఉన్న వీటిని అమెరికా నేషనల్‌ ఆర్కీవ్స్‌ అండ్‌ రికార్డ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ బయటపెట్టింది.

ఇంతకూ ఎవరీ కెన్నడీ?

జాన్ ఎఫ్ కెన్నడీ 1961లో అమెరికా 35వ అధ్యక్షుడు అయ్యారు. రెండేళ్లకే 1963 నవంబరు 22న డాలస్‌ లో హత్యకు గురయ్యారు. కారులో ఉన్న ఆయనపై లీ హార్వే ఓస్వాల్డ్‌ కాల్పులు జరిపాడు. కెన్నడీ చనిపోగా.. దర్యాప్తు సమయంలో హార్వే కూడా హత్యకు గురయ్యాడు. హార్వేను చంపిన వ్యక్తికి శిక్ష వేయగా.. కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్‌తో చనిపోయాడు. దీంతో కెనడీ హత్య ఘటన రహస్యంగానే ఉంది.

Tags:    

Similar News