1 + 1500 + 39... పదవి ముగుస్తోన్న వేళ జో బైడెన్ సంచలన నిర్ణయాలు!

జనవరి నెలలో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్న జో బైడెన్ తన పదవీకాలం ముగిసేలోపు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు

Update: 2024-12-12 23:30 GMT

జనవరి నెలలో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగనున్న జో బైడెన్ తన పదవీకాలం ముగిసేలోపు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే తన కుమారుడు హంటర్ బైడెన్ పై అక్రమ ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసులు ఉండగా.. వాటిలో హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించిన సంగతి తెలిసిందే.

దీంతో... ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై ట్రంప్ వర్గం నుంచి విమర్శలూ వినిపించాయి. అయితే.. తన కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని బైడెన్ తె లిపారు. ఇదే సమయంలో త్వరలో మరికొంతమంది అధికారులు, మిత్రులకు క్షమాభిక్ష మంజూరు చేసే ఆలోచనలో ఉన్నట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అదే జరిగింది.

అవును... పదవీ కాలం ముగుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా... మొన్న తన కుమారుడు ఒక్కరితో మొదలుపెట్టిన బైడెన్ ఇప్పుడు సుమారు 1,500 మంది ఖైదీలకు శిక్ష తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో.. మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.

ఇలా ఒకే రోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా... రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షలు తగ్గించడంతో పాటు క్షమాభిక్ష పిటిషన్లనూ పరిశీలిస్తానని జో బైడెన్ పేర్కొన్నారు.

మరోపక్క తన కుమారుడు హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించిన అనంతరం బైడెన్ పై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా... మరణశిక్ష ఎదుర్కొంటున్న వారితోపాటు అనేకమంది ఖైదీలకు శిక్ష తగ్గింపు లేదా క్షమాభిక్షలపై బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. దీంతో.. బైడెన్ తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి పెరిగింది.

కాగా... గతంలో బరక్ ఒబామా పదవీకాలం ముగిసే సమయంలో ఒకేరోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా.. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. అయితే.. బైడెన్ ఈ రికార్డును తిరగరాశారని అంటున్నారు.

Tags:    

Similar News