వీడ్కోలు స్పీచ్ లో ట్రంప్ ను ఉతికి ఆరేసిన బైడెన్

ఈ సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. దాదాపు నాలుగు నిమిషాలకు పైనే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన నేపథ్యంలో.. ఎమోషన్ కు గురైన జోబైడెన్ తన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు.

Update: 2024-08-21 04:31 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంతకంతకూ దగ్గర పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు ఒక్కొక్క పరిణామం చోటు చేసుకుంటుంది. తాజాగా అలాంటి సన్నివేశం ఒకటి పూర్తైంది. షికాగోలో డెమొక్రటిక్ పార్టీ జాతీయమ కన్వెన్షన్ ను ఉద్దేశించి బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రత్యర్థి ట్రంప్ ను ఉద్దేశించి ఆయన నిప్పులు చెరిగారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకునేందుకు కారణమైన ట్రంప్ పై తనకున్న కసి మొత్తాన్ని తన తాజా ప్రసంగంతో తీర్చుకున్నట్లుగా చెప్పాలి.

‘‘ఓవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తూనే.. మరోవైపు అమెరికాను ఒక ఫెయిల్యూర్ దేశంగా అభివర్ణిస్తున్నారు ట్రంప్.. అది అతని స్థాయి. అతనో లూజర్. అన్ని విషయాల్లోనూ ట్రంప్ ఇప్పటికే ఓడిపోయారు’’ అంటూ తన మాటలతో ఉతికి ఆరేశారు. అదే సమయంలో ఈసారి ఎన్నికల్లోనూ డెమొక్రాట్ల అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బైడెన్ మాట్లాడే సమయంలో సదరు ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వుయ్ లవ్ జో.. థాంక్యూ జో అంటూ డెమొక్రాట్ల ప్రతినిధులంతా ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. దాదాపు నాలుగు నిమిషాలకు పైనే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన నేపథ్యంలో.. ఎమోషన్ కు గురైన జోబైడెన్ తన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పదే పదే థాంక్యూ అంటూ ఉండిపోయారు. అదే సమయంలో కమలా హారిస్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టటం ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. "ఈమె అమెరికాకు 47వ ప్రెసిడెంట్ కావటం తథ్యం. సర్వస్వం దేశానికే ధార పోశా.

నేను.. హారిస్ ఈ నాలుగేళ్లలో అపూర్వ విజయాలు సాధించాం. అధ్యక్షునిగా కొన్ని తప్పులు చేసినా.. దేశం కోసం సర్వస్వం ధారపోశా. 2020లో కొడుకును కోల్పోయి నా ఆత్మలో ఒక భాగాన్ని శాశ్వతంగా కోల్పోయా. అయినా ట్రంప్ లాంటి విచ్ఛిన్న శక్తిని నిలువరించేందుకు అంతటి బాధను పక్కన పెట్టి.. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగా. అలా 2020లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్ానం. 2024లో మరోసారి కాపాడుకోవాలి" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలంతా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న బైడెన్ తీరును ప్రశంసించారు. బైడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని డెమొక్రాట్ల విజయవకాశాల్ని అమాంతం పెంచేసిన 81 ఏళ్ల బైడెన్ ను పార్టీ నేతలు.. ప్రతినిధులు ముక్తకంఠంతో ప్రశంసించారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఇక.. ఈ గురువారం కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా అంగీకరించనున్నారు.

Tags:    

Similar News