కాపులపై కూటమి స్టాండ్ కు జోగయ్య డెడ్ లైన్.. తెరపైకి పవన్ మాట!
కాపు రిజర్వేషన్స్ కి సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ రాశారు.
ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య రాసిన బహిరంగ లేఖలు తీవ్రస్థాయిలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్స్ కి సంబంధించి తన ఆమరణ నిరాహార దీక్ష సమయంలో ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకోవాలని ఓ లేఖ రాశారు.
అవును... కాపు రిజర్వేషన్స్ కి సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో 08-03-2019న టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 45తో చట్టం నెంబర్ 14 ప్రకారం ఎకనామిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్స్ కల్పించడం జరిగిందని జోగయ్య గుర్తు చేశారు.
అయితే... తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని.. ఆ ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయలేదని.. ఈ సమయంలో.. కాపులకు ఈ డబ్ల్యూఎస్ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు.
అయితే... ఈ పిటిషన్ కు గత వైసీపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తూ.. 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరం తెలిపిందని అన్నారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం ఈ మేరకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైడ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు.
ఎందుకంటే... డిసెంబర్ 4న హైకోర్టులో జరిగిన విచారణలో గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ నే సమర్ధిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రస్థావించారని.. ఈ క్రమంలో ఈనెల 28న న్యాయస్థానంలో తదుపరి విచారణ జరగనుందని.. ఈ లోపు కూటమి ప్రభుత్వం కాపు రిజర్వేషన్స్ పట్ల తమ స్టాండ్ ఏమిటో చెప్పాలని జోగయ్య డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా... గతంలో చంద్రబాబు కాపులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరారు. గతంలో తాను ఈ విషయంపై నిరాహార దీక్ష చేసినప్పుడు ఈ అంశంపై కలిసి పని చేద్దామని, దీక్ష విరమించాలని తనకు ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకోవాలని జోగయ్య తాజా లేఖలో పేర్కొన్నారు.