మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామనుకుంటాం.. మీరు అక్కడికి రారు!

ఈ సమయంలో పెద్దాయన పెన్నుకు పనిచెప్పారు! పవన్ పై ఒక లేఖాస్త్రం సంధించారు! ఈ సందర్భంగా పవన్ ను అటు ప్రశ్నిస్తూ, ఇటు కడిగేస్తూ అన్నట్లుగా ఈ లేఖ ఉండటం గమనార్హం!

Update: 2023-12-22 09:51 GMT

కాపులకు రాజ్యాధికారం రావాలని, అది తాను కళ్లారా చూడాలని పరితపించే ఆ సమాజికవర్గానికి చెందిన నేతల్లో హరిరామజోగయ్య ఒకరు! పైగా అందుకు పవన్ కల్యాణ్ సమర్ధుడని కూడా ఆయన బలంగా నమ్ముతుంటారు!! ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో కూటమికి అధికారం వస్తే కనీసం రెండున్నరెళ్లైనా అది సాకారమయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందని భావిస్తుంటారు!! ఈ సమయంలో పవన్ వైఖరి ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది!


ఇలా నాంచుడు ధోరణి లేకుండా... చినబాబు లోకేష్ సూటిగా చెప్పేశారు! బాబు గారు సీఎం అవుతారని.. ఇప్పటికే సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన నాయకత్వం అవసరం అని పవన్ చాలా సార్లు ప్రస్తావించారు కాబట్టి.. ఇంకా డౌంటెందుకు అని ఎదురు ప్రశ్నించినంత పనిచేశారు. ఈ సమయంలో పెద్దాయన పెన్నుకు పనిచెప్పారు! పవన్ పై ఒక లేఖాస్త్రం సంధించారు! ఈ సందర్భంగా పవన్ ను అటు ప్రశ్నిస్తూ, ఇటు కడిగేస్తూ అన్నట్లుగా ఈ లేఖ ఉండటం గమనార్హం!

అవును... చేగొండి హరిరామ జోగయ్య పవన్ చెవిలో జోరీగలా మారారను కోవాలో.. లేక, పవన్ నిజ స్వరూపాన్ని పరోక్షంగా జనసైనికులకు చెప్పకుండా చెబుతున్నారని అనుకోవాలో తెలియదు కానీ... కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ... పవన్ కళ్యాణ్ పాలిట విలన్ మాదిరి తయారయ్యారు! ఈయన చేసే వ్యాఖ్యలు, పవన్ ని అడిగే ప్రశ్నలు, జనసేనకు చేసే సూచనలు, వాటిని జనసేనాని లైట్ తీసుకునే విధానం ఒక రోటీన్ ప్రక్రియగా మారిపోయింది.

దీంతో... పవన్ కళ్యాణ్ ఇమేజిని, ప్రతిష్టను, కాపుల్లో ఉన్న గౌరవాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్నారా అనే సందేహాలూ పలువురు వ్యక్తపరుస్తుంటారు. అయితే ఆయన సంధించే ప్రశ్నలు కాపు సామాజికవర్గంలో చాలామంది మనోభావాలకు అద్దంపడుతున్నాయనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తుంటాయి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ను గత కొంతకాలంగా సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జోగయ్య.

కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్... మొన్నా మధ్య జనసేనకు కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసారు. పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు ఓ పాతిక ఇరవై సీట్లు ఇచ్చేఅవకాశం ఉందని కథనాలొస్తున్న తరుణంలో... తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమయింది.

ఇందులో భాగంగా.. కాపులు దాదాపు 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు వెళ్లాలని, ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలనీ ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాసారు. ఈ క్రమంలో తాజాగా మరోలేఖాస్త్రం సంధించారు హరిరామ జోగయ్య. ఈ లేఖలో పవన్ ను మరింత సూటిగా ప్రశ్నించడం గమనార్హం.

నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని అనుకుంటున్నాం.. కానీ మీరు అక్కడికి రారు.. ఇక్కడే ఉంటాను అంటారు.. ఇలా ఐతే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు హరిరామ జోగయ్య! టీడీపీ - జనసేన కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి, ఆ విషయం పవన్ కూడా అంగీకరించారు అంటూ లోకేష్ సైతం ప్రకటించారు. దీంతో జోగయ్యకు మరింత మండినట్లుగా అనిపిస్తుంది. దీంతో సీరియస్ గా లేఖ రాశారు.

రాబోయే కాలంలో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని సూటిగా, స్పష్టంగా లోకేష్ చెప్పిన తర్వాత కూడా మీరు చంద్రబాబు వెంట వెళ్తారా..? అంటూ జోగయ్య ప్రశ్నించారు. అంటే మీరు చంద్రబాబుకు తాబేదారుగా ఉంటారా..? మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా..? మీకు అస్తిత్వం లేదా..? కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా..? అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలు పవన్ కు గుక్కతిప్పుకోనివ్వడం లేదనే అనుకోవాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... జోగయ్య సంధించిన ఈ సూటి ఘాటు ప్రశ్నలు పవన్ తో పాటు ఆయన వెంట నడిచే కాపు సామాజికవర్గ ప్రజానికానికి కూడా సంధించారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. పైగా... చంద్రబాబు ఇప్పటికే.. టీడీపీ భవిష్యత్ నేత లోకేష్ అనే సంకేతాలు నిన్నటి సభలో ఇచ్చేసిన తర్వాత కూడా... పవన్ కల్యాణ్ ఇప్పటికీ అధికారం విషయంలో వాటా అడగకుండా... సన్నాయి నొక్కులు నొక్కడం కచ్చితంగా ఆ సామాజికవర్గ జనాల్లో ఆగ్రహావేశాలు తెప్పించేదే. కాకపోతే... జోగయ్య కాస్త స్మూత్ గా రియాక్ట్ అయ్యారు.. పూర్తి విషయం జనసైనికులకు అర్ధమైతే రియాక్షన్ ఇంకాస్త బలంగా ఉండే అవకాశం లేకపోలేదు!!

Tags:    

Similar News