టోన్ చేంజ్ : ధైర్యాన్ని పూసుకున్న జోగి !

తన మీద అక్రమ కేసులు పెట్టి ఏదో సాధించాలని అనుకుంటున్నారని కానీ తాను దేనికీ భయపడను అని ఆయన డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.;

Update: 2025-04-11 17:58 GMT
టోన్ చేంజ్ : ధైర్యాన్ని పూసుకున్న జోగి !

వైసీపీలో జోగి రమేష్ ఒక ఫైర్ బ్రాండ్ ఫిగర్. పార్టీలో జగన్ కి వీర విధేయుడు. అందుకే ఆయనకు రెండవ టెర్మ్ లో జగన్ మంత్రి పదవి ఇచ్చారు. ఇక జోగి వైసీపీ అయిదేళ్ళ అధికారంలో తన పెద్ద గొంతుకతో నాటి విపక్షాల మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యేవారు. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసేవారు.

ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి మీదకు దాడి చేసిన కేసులో ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఆయనను సీఐడీ నోటీసులు ఇచ్చి తాజాగా పిలిపించింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని గంటల పాటు సీఐడీ ఆఫీసులో ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం మీద ధాటీగానే విమర్శలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉంటుందని భావించద్దు అన్నారు.

రెడ్ బుక్ ని తీసి మడచిపెట్టుకోవాలని సెటైర్లు వేశారు. మంచి పాలన ఇస్తేనే ప్రజలు జై కొడతారని అన్నారు. ఇటీవలనే ఒక సర్వే వచ్చిందని ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే 75 మందికి డిపాజిట్లు గల్లంతు అవుతాయని జోగి రమేష్ చెప్పుకొచ్చారు.

కడుపు నిండా అన్నం పెట్టిన జగన్ ని వదిలి పలావ్ పెడతారు అని ఆశతో బాబుకు ఓటేశామని నూటికి 70 శాతం మంది ప్రజలు బాధపడుతున్నారని ఆయన కొత్త విషయం చెప్పారు. ఏపీలో వారసత్వ రాజకీయం సాగుతోందని బాబు కుర్చీ వదిలేస్తే తీసుకోవడానికి సొంత పుత్రుడు దత్తపుత్రుడు పోటీ పడుతున్నారని జోగి రమేష్ హాట్ కామెంట్స్ చేశారు.

ఎపుడో జరిగిన దానికి ఇపుడు కేసులు పెట్టి విచారణ చేయడమేంటని తన కేసు మీద కూడా ఆయన ఫైర్ అవుతున్నారు. ఆనాడు తమ కార్ల మీద టీడీపీ శ్రేణులు దాడి చేశాయని తమ పైన దాడులు చేశాయని వారి మీద కేసులు ఉండవా అని జోగి రమేష్ లాజిక్ పాయింట్ తీసారు.

గతంలో జగన్ మీద సభ్యసమాజం తలదించుకునేలా ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు అసభ్య వ్యాఖ్యలు చేసారని వాటి మీద నిరసన తెలియజేయడానికి మాత్రమే తాము చంద్రబాబు ఇంటికి వెళ్లామని జోగి రమేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన మీద అక్రమ కేసులు పెట్టి ఏదో సాధించాలని అనుకుంటున్నారని కానీ తాను దేనికీ భయపడను అని ఆయన డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తాను విచారణకు హాజరయ్యాను అని అన్నారు. ఇదిలా ఉంటే గత పది నెలలుగా పెద్దగా సౌండ్ చేయని జోగి ఇపుడు ఒక్కసారిగా ఈ విధంగా కూటమి సర్కార్ మీద ఫైర్ కావడంతో చర్చ సాగుతోంది.

జోగి ధైర్యం పూసుకున్నారని అంటున్నారు. ఆయన ఒక దశలో కూటమిలో చేరేందుకు చూశారని కూడా చెప్పుకున్నారు. అయితే ఇపుడు ఆయన మళ్ళీ వచ్చేది వైసీపీయే అని జోస్యం చెబుతున్నారు. ఇంతలో ఎంత మార్పు అని అంటున్నారు. అసలు ఏమి అయింది. జోగిలో ఈ డేరింగ్ కి కారణం ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఏపీలో రాజకీయ గాలి మారుతోందని వైసీపీ నేతలు భావిస్తున్నారా లేక కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు రెడీ అని ముందుకు వస్తున్నారా అన్నదే అంతా చర్చిస్తున్నారు.

Tags:    

Similar News