మైనంపల్లి, మహేందర్ రెడ్డిని రెచ్చగొడుతున్న జూపల్లి!

తాజాగా కాంగ్రెస్ నాయకుడు జూపల్లి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2023-08-23 14:47 GMT

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పైకి ఆ పార్టీ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిని జూపల్లి క్రిష్ణారావు ఉసిగొల్పుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నాయకుడు జూపల్లి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి తమ పౌరుషం చూపించాలని తాజాగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్కు దిమ్మతిరిగేలా పట్నం, మైనంపల్లి వ్యవహరించాలని జూపల్లి విన్నవించడం గమనార్హం.

తాండూరు నియోజకవర్గ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోటీ పడ్డ సంగతి తెలిసిందే. రోహిత్కు టికెట్ ఇస్తే పార్టీ మారతానని కూడా పట్నం హెచ్చరించారు.

కానీ వీళ్ల మధ్య కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి.. రోహిత్కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని తెలిసింది. మరోవైపు మెదక్లో తన కొడుకు రోహిత్కు టికెట్ దక్కకపోవడానికి హరీష్ కారణమంటూ ఆయనపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిని కేసీఆర్ పైకి జూపల్లి ఉసి గొల్పుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మైనంపల్లి మాట్లాడారని జూపల్లి అన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మైనంపల్లిని కాంగ్రెస్లోకి జూపల్లి ఆహ్వానిస్తున్నట్లే కనిపిస్తున్నారని టాక్.

కేసీఆర్ పై విమర్శలు చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జూపల్లి.. కొల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన బాటలోనే మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిని తీసుకెళ్లేందుకు జూపల్లి ప్రయత్నిస్తారేమోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News