విడాకుల కేసు విచారణ వేళ సీజేఐ కీలక వ్యాఖ్యలు

సదరు విడాకుల కేసు సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Update: 2024-09-30 23:30 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విడాకుల కేసు విచారణ వేళ.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళ.. కేసు విచారణను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరిన నేపథ్యంలో సీజేఐ అనూహ్యంగా స్పందించారు. ‘ఏదైనా కేసును సాగదీస్తే దానివల్ల లాయర్లకే లాభం’’ అని పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టికే డీవై చంద్రచూడ్. సదరు విడాకుల కేసు సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

విచారణ సందర్భంగా సదరు మహిళ విద్యార్హతలను అడగ్గా.. ఆమె తాను ఎంటెక్ పూర్తి చేశానని.. అమెరికా వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లుగా బదులిచ్చారు. ప్రస్తుతం తానేమీ జాబ్ చేయట్లేదన్న ఆమె మాటలకు సీజేఐ స్పందిస్తూ.. ‘‘మీరు చదువుకున్న వారు. ముందు మంచి ఉద్యోగాన్ని సంపాదించండి. ఈ కేసులో మీరు పదేళ్లు అయినా న్యాయపోరాటం చేయగలరేమో. కానీ దాని వల్ల లాయర్లకే ప్రయోజనం కలుగుతుంది’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. పరస్పర సమ్మతితో విడాకులు తీసుకునేందుకు మీరెందుకు అంగీకరించకూడదన్న ఆయన.. ‘‘మీరు అంగీకరిస్తే కేసును మూసేస్తాం. మీరు వైవాహిక బంధాన్ని తిరిగి కొనసాగించే పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతోంది. మీరు చదువుకోని వారైతే వేరుగా ఉండొచ్చు. కానీ.. మీరు చదువుకున్న వారు. ఉద్యోగం సంపాదించగలరు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News