'ఖలీస్థానీ - సిక్కులు... హిందువులు - మోడీ'... కెనడా పీఎం కీలక వ్యాఖ్యలు!
ఖలిస్థానీ మద్దతుదారులకు ఆశ్రయం కల్పిస్తోన్న కెనడా.. గత కొంతకాలంగా భారత్ పట్ల వ్యవహరిస్తోన్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే
ఖలిస్థానీ మద్దతుదారులకు ఆశ్రయం కల్పిస్తోన్న కెనడా.. గత కొంతకాలంగా భారత్ పట్ల వ్యవహరిస్తోన్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తీరుతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత పతనావస్థకు చేరుకున్నాయి. ఈ సమయంలో.. కెనడాలో ఖలిస్థానీ ఉనికిపై ట్రూడో తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తమదేశంలో ఖలీస్థానీ మద్దతుదారుల ఉనికిని అంగీకరిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే... వారంతా కెనడాలోని సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించడం లేదని అన్న్నారు. ఇలా ఖలీస్థానీ మద్దతుదారుల ఉనికి గురించి ట్రూడో అంగీకరించడం.. కెనడా ప్రభుత్వంపై భారత ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది.
ఈ సందర్భంగా స్పందించిన జస్టిన్ ట్రూడో... "కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు చాలా మంది ఉన్నారు.. కానీ, వారు మొత్తం సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించరు. అలాగే.. కెనడాలో మోడీ ప్రభుత్వ మద్దతుదారులూ ఉన్నారు.. కానీ, వారు మొత్తం హిందూ కెనడియన్లందరికీ ప్రాతినిధ్యం వహించరు” అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... హింస, అసహనం, విభజ, బెదిరింపులకు తావు లేదని.. ఆయా వర్గాల సంప్రదాయాలను కొనసాగించేలా తాము ప్రోత్సహిస్తామని.. భారత ప్రాదేశిక సమగ్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్రూడో చెప్పుకొచ్చారు. భారత సంతతి మంత్రుల ఆధ్వర్యంలో కెనడా పార్లమెంట్ హౌస్ లో జరిగిన దీపావళి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా... భారత ప్రభుత్వ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన నిజ్జర్ 18 జూన్ - 2023న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గల గురుద్వార్ బయట కాల్చి చంపబడ్డాడు.
కాగా... గత నెలలో నిజార్ హత్యపై దర్యాప్తులో భాగంగా... భారత్ హైకమిషనర్ పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ అభియోగాన్ని భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. ఇదే సమయంలో... ఒట్టావాలోని తన హైకమీషనర్ ని రికాల్ చేయడంతోపాటు.. ఢిల్లీలోని ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది.