భారత్ మీద మరోసారి విషం కక్కిన ట్రూడో

కెనడా ప్రధానమంత్రి భారత్ మీద తనకున్న కోపాన్ని.. అక్కసును తరచూ వెళ్లగక్కటం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నోటికి పని చెప్పారు.

Update: 2023-11-13 04:25 GMT

ప్రజల్లో వ్యతిరేకత.. సొంత పార్టీల్లోనూ అసమ్మతితో కిందా మీదా పడుతున్న కెనడా ప్రధానమంత్రి భారత్ మీద తనకున్న కోపాన్ని.. అక్కసును తరచూ వెళ్లగక్కటం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నోటికి పని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో భారత్ ను నిందించటం ద్వారా.. మరో వివాదాన్ని రాజేశారు.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ నిజ్జర్ ను భారత నిఘా వర్గాలు హత్య చేశాయన్న ఆరోపణ గురించి తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించిన ట్రూడో.. మరోసారి అలాంటి పనే చేశారు. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందన్న ఆయన.. "తమ దేశ పౌరుడిపై జరిగిన హత్యపై విచారణ జరపాలి. పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరం. నిజ్జర్ హత్యకేసులో భారత్ చట్టాల్ని ఉల్లంఘించి.. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసింది" అని ఆరోపించారు.

ఈ అంశంపై చర్చించాలని అమెరికాతో పాటు మిత్రదేశాల్ని కోరారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పిన ట్రూడో.. తమ దేశం రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకేసులో భారత దౌత్య అధికారుల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనికి స్పందించిన భారత్.. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి.. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. ఈ హత్య కేసులో దర్యాప్తునకు సహకరించాలని కోరుతూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రూడో.. తాజాగా మరోసారి ఈ వివాదాన్ని తన వ్యాఖ్యలతో తెర మీదకు తీసుకొచ్చారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News