తన శత్రువుల జాబితా ప్రకటించిన కేఏపాల్.. మోడీ, షాలకు లేఖ!

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా తన వంతు పోరాటం తాను చేస్తానన్నట్లుగా ఆయన ముందుకు కదులుతున్నారు

Update: 2024-10-21 06:58 GMT

ఏపీ రాజకీయాల్లో తనదైన మార్కు స్టైల్ తో హల్ చల్ చేసే రాజకీయ నాయకుల్లో టాప్ వరుసలో ఉంటారు కేఏ పాల్ అని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు! ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా కనిపించే పాల్.. గత కొన్ని రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కోర్టులో పోరాడుతున్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా తన వంతు పోరాటం తాను చేస్తానన్నట్లుగా ఆయన ముందుకు కదులుతున్నారు. ఈ సమయంలో తాజాగా తనను కొందరు చంపాలనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. ఈ మేరకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు!

అవును... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. తనను కొంతమంది చంపాలని చూస్తున్నారని.. అందువల్ల తనకు భద్రత పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేఖ రాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన శత్రువుల జాబితాను ప్రకటించారు.

ఇందులో భాగంగా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తనకు శత్రువులే అని కేఏ పాల్ పేర్కొన్నారు. ఇక.. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ సూచన చేశారు కేఏ పాల్.

ఇక తనను ఎవరైనా చంపితే తాను స్వర్గానికి పోతానని.. తనను చంపాలనుకున్నవరు చనిపోతే నరకానికే పోతారంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథయంలోనే... చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా బీజేపీ, ఆరెస్సెస్, తీవ్రవాదుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయనే విషయాని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ధృవీకరిస్తున్నాయని కేఏ పాల్ తెలిపారు.

ఇదే క్రమంలో... వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే.. పోలీసులు లాఠీఛార్జులు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్... అభ్యర్థులను గాయపరచడం సరైన చర్య కాదని అన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఫైరయ్యారు.

ఈ నేపథ్యంలోనే పాలన చేతకాకపోతే రేవంత్ రాజీనామా చేయాలని పాల్ సూచించారు! ప్రతిపక్షంలో ఉన్నంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ పదే పదే ఆరోపించిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక సీబీఐకి ఎందుకు లేఖ రాయడం లేదని పాల్ ప్రశ్నించారు!

Tags:    

Similar News