ప్రత్యేక హోదా కోసం కేఏ పాల్ పోరాటం
ప్రత్యేక హోదా అన్నది ఇపుడు ఎక్కడైనా వినిపిస్తోందా. మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అన్నీ ఆ విషయమే మరచిపోయాయి.
ప్రత్యేక హోదా అన్నది ఇపుడు ఎక్కడైనా వినిపిస్తోందా. మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అన్నీ ఆ విషయమే మరచిపోయాయి. ఇంకా చెప్పాలీ అంటే అసలు ఏ మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ జనసేన అయితే ఆ మాటను కూడా పలకాలని చూడడం లేదు. చాలా జాగ్రత్త పడుతున్నాయి.
టీడీపీ కూటమి ఎన్నికల హామీలలో ఎన్నో ప్రకటించింది కానీ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు చంద్రబాబు సీఎం అయిన తరువాత అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలసి వస్తున్నా ప్రత్యేక హోదా మాత్రం అసలు అడగడం లేదు.
ప్రత్యేక హోదా సాధన సమితి అని అపుడపుడు నినదించే కొన్ని సంఘాలు ప్రజా సంఘాలు వామపక్ష సంఘాలు కూడా ఇపుడు ఆ ఊసు తలవడం లేదు. అదేంటో తెలియదు కానీ అధికారంలో ఉన్నవారు అపొజిషన్ లో ఉన్న వారు కూడా ప్రత్యేక హోదా గురించి చాలా కన్వీనియంట్ గా మరచిపోయారు.
బీజేపీ అంటే మండిపడే వామపక్ష నాయకులు అదే బీజేపీతో కూటమి కట్టి అధికారంలో ఉన్న చంద్రబాబును కలుస్తూ మురిసిపోతున్నారు. మొత్తానికి మోడీ అమిత్ షా ఏదైతే కోరుకుంటున్నారో ఏపీలోని అన్ని పార్టీలూ అదే అమలు చేస్తున్నాయి.
మరి ఈ నేపధ్యంలో ఒకే ఒక్కడు అన్నట్లుగా ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఏకంగా హైకోర్టులో ఒక ప్రజా వ్యాజ్యం పిటిషన్ ని దాఖలు చేశారు. ఆయన అందులో పేర్కొన్నది ఏంటి అంటే లోక్‌సభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులనివ్వాలని కోరారు.
ప్రత్యేక హోదా అన్నది ఉత్త హామీ కాదు చట్ట సభలలో ప్రధాని హోదాలో ఇచ్చిన హామీ. దానికే అమలుకు ఠికానా లేకపోతే ఎలా అన్న పాయింట్ తోనే కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాదు ఏపీని అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకునేలా చేయాలని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు వీలుగా అన్ని పన్ను మినహాయింపులు, రాయితీలు ఇచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆ పిటిషన్ లో కోరారు.
ఇక మోడీకి సైతం గుర్తుకు వచ్చేలా ఆయన చెప్పాల్సింది చెప్పారు. అప్పట్లో ప్రధానమంత్రి అభ్యర్ధిగానే 2014 ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇచ్చారని కేఏ పాలు పేర్కొన్నారు. ఇక మోడీ ముమ్మారు ప్రధానిగా ఉన్నా కూడా ఈ రోజుకీ ప్రత్యేక హోదా అన్నది ఎక్కడా ఏపీలో అమలు కాలేదన్నారు.
ఈ పిటిషన్ లో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు కూడా చేశారు. దాంతోనే పిల్ దాఖలు చేయాల్సి వచ్చిందని ఆయన చెబుతూ ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేస్తూ కేసు వేశారు. మరి ఈ కేసు ఏ విధంగా విచారణకు వస్తుందో ఆ మీదట ఏపీ ప్రభుత్వం పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కేయే పాల్ కి మాత్రం ప్రత్యేక హోదా అన్నది ఇంకా గుర్తు ఉండడం విశేషమే అంటున్నారు.