ఫిర్యాదు కాలేదు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు.. బాలీవుడ్ నటి అరెస్టు లో కొత్త కోణం!

ఎందుకంటే.. జత్వానీపై ఫిర్యాదు రావటానికి ముందే ఆమెను ముంబయి నుంచి తీసుకొచ్చేందుకు వీలుగా విమాన టికెట్లు కొన్న వైనం వెలుగు చూసింది.

Update: 2024-09-13 04:57 GMT

గత వైసీపీ సర్కారులో బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసి ఆమెను శారీరకంగా.. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లుగా పేర్కొంటూ వచ్చిన కథనాలు.. వెలుగు చూసిన నిజాల పరంపరలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమెను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ముంబయి నుంచి విజయవాడకు తీసుకురావటం తెలిసిందే. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకొని.. అనంతరం రిమాండ్ కు తరలించటం.. రాజీ చేసుకుంటామన్న హామీ తర్వాత తమను విడిచి పెట్టినట్లుగా తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. ఈ వ్యవహారమంతా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.

అయితే.. ఈ ఇష్యూకు సంబంధించిన మరో కీలక అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. జత్వానీ అరెస్టుకు ముందు ఆమెను ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు విమానటికెట్లు కొన్న అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. జత్వానీపై ఫిర్యాదు రావటానికి ముందే ఆమెను ముంబయి నుంచి తీసుకొచ్చేందుకు వీలుగా విమాన టికెట్లు కొన్న వైనం వెలుగు చూసింది.

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీం పట్నం పోలీసుస్టేషన్ లో ఫిబ్రవరి 2న ఉదయం ఆరున్నర గంటల వేళలో కంప్లైంట్ చేస్తే.. అదే రోజు 11.30 గంటలకు విమానంలో డీసీపీ విశాల్ గున్ని.. అదనపుడీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన టీం మంబయి వెళ్లింది. వీరి విమాన టికెట్లను ఫిబ్రవరి 1న బుక్ చేయటం చూస్తే.. విద్యాసాగర్ కంప్లైంట్ ఇవ్వటానికి ముందే.. జత్వానీ అరెస్టుకు సంబంధించిన ప్లానింగ్ జరిగిన వైనం తాజా ఆధారాలతో బయటకు వచ్చిందన్నమాట వినిపిస్తోంది.

ముంబయి పారిశ్రామికవేత్త పేరు ఎక్కడా బయటకు రాకుండా ఇష్యూను సెటిల్ చేయాలని ముఖ్యనేత నుంచి వచ్చిన ఆదేశాల్ని నాటి నిఘా చీఫ్ పి. సీతారామాంజనేయులు సీన్లోకి వచ్చారని.. జనవరి 31న ఈ ఇష్యూ మీద విజయవాడ సీపీ కాంతిరాణా తాతాతో చర్చించినట్లుగా చెబుతున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏదో ఒక కేసు పెట్టి..కాదంబరి జత్వానీని అరెస్టు చేయాలన్నప్లానింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లే.. విద్యాసాగర్ ను పిలిపించి.. జత్వానీకి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇప్పించారని.. తప్పుడు ఒప్పంద పత్రాన్ని క్రియేట్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయాలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన ఆధారాల విషయంలో అస్పష్టత ఉంది. అయితే.. ఫిర్యాదు రావటానికి ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిన వైనంతో పోలీసు అధికారులు దొరికారన్న మాట వినిపిస్తోంది. ఈ ఇష్యూ మొత్తానికి కర్త..కర్మ.. క్రియ సీతారామాంజనేయులుగా చెబుతున్నారు. ఈ ఇష్యూలో తమకు చిక్కులు తప్పవన్న విషయంపై అవగాహనకు వచ్చిన పలువురు పోలీసులు అప్రూవర్లుగా మారటం చూస్తే.. పలువురు పెద్దలకు తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. నాడు ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకున్నట్లుగా ఈ కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న స్రవంతి రాయ్ ముందు అన్ని విషయాల్ని ఓపెన్ గా చెప్పేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా జత్వానీ ఇష్యూ మరోసారి తెర మీదకు వచ్చినట్లైంది.

Tags:    

Similar News