ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఒక్కసారి పెద్దగా అరిచిన జెత్వానీ.. ఎందుకంటే?
కొద్ది రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ సంచలనంగా మారిన బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన ఒక షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 16 Sep 2024 5:30 AM GMTకొద్ది రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ సంచలనంగా మారిన బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన ఒక షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు.. ముగ్గురు పోలీసు ఉన్నతాధకారుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు రెండు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదు కాపీ ఇస్తున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటివరకు కామ్ గా ఉన్న ఆమె.. అక్కడే ఉన్న ఒక ఎస్ఐను చూసినంతనే ఆమె తీవ్రంగా రియాక్టు అయ్యారు.
ముంబయి నుంచి తనను తన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో తమను తీసుకొచ్చిన వారిలో.. ఇబ్రహీంపట్నం స్టేషన్ లోని ఒక ఎస్ఐ ఉండటం.. అతన్ని చూసినంతనే గుర్తించారు జెత్వానీ. అంతే.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆమె.. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ.. ‘‘ఇతడే.. ఇతడే.. ఈ అధికారే మమ్మల్ని ముంబయి నుంచి తీసుకొచ్చారు’’ అంటూ పెద్దగా అరిచేయటంతో ఒక్కసారిగా షాకింగ్ వాతావరణం చోటు చేసుకుంది.
ఇప్పటికే జెత్వానీ విషయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్న వేళ.. ఈ ఎపిసోడ్ తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న పోలీసు అధికారులంతా వణికిపోతున్న పరిస్థితి.అలాంటింది.. పోలీస్ స్టేషన్ లో ఇప్పటికి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఒక అధికారిపై జెత్వానీ ఆగ్రహం వ్యక్తం చేయటం చూసినప్పుడు.. జెత్వానీ ఇష్యూలో సంబంధం ఉన్న చిన్నస్థాయి అధికారుల జాబితాను లెక్క తీయటం.. వారందరిని సమగ్రంగా విచారించటం లాంటివి జరగలేదా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఒకవేళ.. అదే జరిగితే.. జెత్వానీని ముంబయి నుంచి తీసుకొచ్చిన సదరు అధికారిపై కనీసం అప్రాధాన్యత పోస్టులోకైనా బదిలీ చేసి ఉండాలి కదా? అలాంటిదేమీ జరగలేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. జెత్వానీ ఆగ్రహంతో.. సదరు ఎస్ఐ పని తీరు చర్చగా మారటమే కాదు.. అతడి విషయంలోనూ చర్యలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.