సొంత జిల్లాలో జగన్ కు భారీ షాక్
కడప కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు పలువురు జగన్ కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు.
అధికారం ఎటు ఉంటే.. అటు వైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్న ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మిగిలిన చోట ఎలా ఉన్నా ఫర్లేదు కానీ అధినేత సొంత ప్రాంతానికి చెందిన నేతలు వ్యవహరించే తీరు మిగిలిన ప్రాంతాల మీదా ఎక్కువ ప్రభావాన్ని చూపే పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అదినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కడప కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు పలువురు జగన్ కు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఎనిమిది మంది కార్పొరేటర్లు ఈ రోజు (సోమవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ మారేందుకు సిద్ధమైన వైనం కడప జిల్లాలోనే కాదు.. ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. కడప జిల్లా అన్నంతనే.. యావత్ జిల్లా మొత్తం వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా చెబుతారు. ఈ కారణంతోనే ఎన్నికలు ఏదైనా సరే.. జిల్లాకు చెందిన మెజార్టీ స్థానాలు వైఎస్ కుటుంబం ఏ పార్టీని ఫాలో అవుతుందో ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోవటం ఖాయం. అలాంటిది జగన్ చేతి నుంచి అధికారం చేజారిన ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెఢీ అయిపోయారు.
ఈ పరిస్థితుల్లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీ మారేందుకు సిద్ధమైన ఎనిమిది మంది కార్పొరేటర్లను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా పార్టీ మారేందుకు సిద్ధమైన కార్పొరేటర్లలో ఒకరు గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు వరుసకు సోదరుడు కావటం గమనార్హం.
అంతేకాదు.. కడప మేయర్ సురేష్ బాబుకు కంచుకోట లాంటి చిన్న చౌక్ లో మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధం కావటం రాజకీయ సంచలనంగా మారింది. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధమైన వైసీపీ కార్పొరేటర్లు పలువురు ఆదివారం సాయంత్రమే విజయవాడకు తరలి వెళ్లారు. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు కడప ఎంపీగా వ్యవహరిస్తున్న అవినాష్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినట్లుగా చెబుతున్నారు. తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. తాము ఏమీ చేయలేమని తేల్చేయటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
పవర్ లో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని.. తాము అడిగిన పనులను చేసేందుకు ఆసక్తి చూపలేదని మండిపడుతున్నారు. దీనికి తోడు ఈ నెల ఏడున కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ వేకపోవటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటన తర్వాత టీడీపీ నేతలు ఈఇష్యూను సీరియస్ గా తీసుకోవటంతో పాటు.. ఎమ్మెల్యే కుర్చీ తొలగించిన వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలన్న లక్ష్యంగా పని చేసినట్లుగా చెబుతున్నారు.
అధికారం చేజారిన తర్వాత ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా వైసీపీ నేతల తీరు కారణంగా పార్టీకి భారీ నష్టం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీ అగ్రనాయకుల మీద కార్పొరేటర్లకు ఉన్న అసమ్మతి కలిసి వచ్చిందని చెబుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా సాగిన ఆపరేషన్ చివరకు ఎనిమిది మంది కార్పొరేటర్లు పార్టీ మారేందుకు ఓకే చెప్పటంతో కడప వైసీపీకి భారీ దెబ్బగా అభివర్ణిస్తున్నారు.