టీ కొట్టులో దుకాణం పెట్టేసిన కదిరి సబ్ రిజిస్ట్రార్

శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. పట్టణంలోని ఒక టీకొట్టులో దుకాణం పెట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2025-02-02 05:05 GMT

అవినీతికి అలవాటు పడితే ఒక పట్టాన బయటకురాలేరు. డబ్బురుచి మరిగితే ఎంతటి బరితెగింపుకైనా సిద్దమన్నట్లుగా వ్యవహరిస్తారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది కదిరి సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంచూస్తే. తాజాగా ఆయన భాగోతం బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. పట్టణంలోని ఒక టీకొట్టులో దుకాణం పెట్టేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీకొట్టులో తాపీగా కూర్చొని.. ల్యాండ్స్ సేల్స్ డీడ్స్ పై ఇట్టే సంతకాలు చేసేయటం.. ఈ ఎదవ పనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అతడి బాగోతం బయటకు వచచింది.

ఏపీలో భూముల మార్కెట్ విలువల్ని ప్రభుత్వం సవరించటం.. శనివారం నుంచి కొత్త విలువలు అమల్లోకి రావటం తెలిసిందే. పాత ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో గడిచిన నాలుగైదు రోజులుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద రద్దీ కనిపించింది. ఇదిలా ఉంటే.. పర్సనల్ పనుల కారణంగా శుక్రవారం సెలవులో ఉన్నట్లుగా సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు తన సిబ్బందికి మౌఖికంగా సమాచారం ఇచ్చారు.

ఆఫీసుకు రాని ఈ పెద్ద మనిషి.. ఎంచక్కా తాను సెట్ చేసుకున్న టీ షాపు వద్దకు పిలిపించుకొని అక్కడే ఫైళ్ల మీద సంతకాలు చేసిన వైనం షాకింగ్ గా మారింది. అవినీతికి అలవాటు పడిన తర్వాత ఒక మోస్తరు తెగింపు మామూలే. కానీ.. ఈ స్థాయి బరితెగింపు షాకింగ్ గా మారింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసింది. కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News