బూందీ లడ్డూను ఎర వేసి ఖైదీని పట్టేసిన పోలీసులు!
ఒక ఖైదీ అతితెలివి ప్రదర్శించి.. తప్పించుకుంటూ ఉన్నాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు కొత్త ఎత్తుగడ వేశారు.
పెరోల్ మీద విడుదలైన ఖైదీ.. తనకు పెరోల్ ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే లొంగిపోవాల్సి ఉంటుంది. కానీ.. ఒక ఖైదీ అతితెలివి ప్రదర్శించి.. తప్పించుకుంటూ ఉన్నాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు కొత్త ఎత్తుగడ వేశారు. వారు పన్నిన ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. 40 ఏళ్ల కైలాశ్ అనే వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో దోషి. అతడికి 2011లో జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అతడ్ని జైలుకు తరలించారు.
2021లో కరోనా నేపథ్యంలో 3 నెలలు పెరోల్ ఇవ్వటంతో జైలు నుంచి విడుదల అయ్యాడు. గడువు ముగిసిన తర్వాత అతడు లొంగిపోలేదు. తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు తాను ఉండే ప్రదేశాల్ని మార్చేస్తున్నాడు. దీంతో.. అతడ్ని పట్టుకోవటం ఒక సవాలుగా మారింది.
ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ లోని తన సొంతూరుకు వచ్చి కూలి పనులు చేసుకుంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకోవటానికి పక్కా ప్లాన్ వేశారు. స్థానిక పోలీసు ఇన్ఫార్మర్ల ద్వారా అతడి కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించిన పోలీసులు.. అతడికి అనుమానం రాకుండా ఒక ప్లాన్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా గ్రామస్థులకు బూందీ లడ్డూ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
అందరితో పాటు.. బూందీ లడ్డూ తీసుకోవటానికి వరుసలో వచ్చిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని జైలుకు తరలించారు. ఏళ్లుగా దొరక్కుండా తప్పించుకుంటున్న కైలాష్ కు ఆటలకు బూందీ లడ్డూతో పోలీసులు చెక్ పెట్టారు. ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.