అడ్రస్ లేని కాకాణి.. హైదరాబాద్ వెళ్లిన నెల్లూరు పోలీసులు

అయితే నెల్లూరులో ఆయనకు చెందిన మూడు ఇళ్లకు తాళాలు వేసివుండటంతో కాకాణి ఎక్కడికి వెళ్లారనేది మిస్టరీగా మారింది. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు నెల్లూరు పోలీసులు హైదరాబాద్ పయనమైనట్లు చెబుతున్నారు.;

Update: 2025-03-31 10:27 GMT
అడ్రస్ లేని కాకాణి.. హైదరాబాద్ వెళ్లిన నెల్లూరు పోలీసులు

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారా? అక్రమ మైనింగు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాకాణి పోలీసు విచారణ నుంచి తప్పించుకుతిరుగుతున్నారని చెబుతున్నారు. ఉగాది రోజున కాకాణి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన అందుబాటులో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఆ నోటీసుల మేరకు సోమవారం కాకాణి పోలీసు విచారణ ఎదుర్కోవాల్సివుంది. అయితే నెల్లూరులో ఆయనకు చెందిన మూడు ఇళ్లకు తాళాలు వేసివుండటంతో కాకాణి ఎక్కడికి వెళ్లారనేది మిస్టరీగా మారింది. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు నెల్లూరు పోలీసులు హైదరాబాద్ పయనమైనట్లు చెబుతున్నారు.

తనపై ఎన్నికేసులు పెట్టినా తగ్గేదేలే అంటూ రెండు రోజుల క్రితమే పోలీసులకు సవాల్ విసిరిన కాకాణి, ఒక కేసులో నోటీసు జారీ అయ్యేసరికి జడసుకుని పారిపోయారని టీడీపీ విమర్శిస్తోంది. నెల్లూరులో అక్రమ మైనింగుపై పోలీసు కేసు ఎప్పుడో నమోదైంది. అయితే ఇందులో కొత్తగా కాకాణి పేరు చేర్చడమే రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతుందని తెలుసుకున్న వెంటనే కాకాణి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారని అంటున్నారు. ఆయన, ఆయన వ్యక్తిగత సహాయకుల ఫోన్లు సిచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు. పోలీసులు నోటీసులు పట్టుకుని వస్తున్నారని తెలిసిన వెంటనే కాకాణి ఎవరికీ కనిపించకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. కాకాణి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో పోలీసులు గత్యంతరం లేక ఆయన గోడకు నోటీసులు అంటించారు.

సోమవారం విచారణకు రావాల్సిన కాకాణి ఆ పనిచేయకపోవడంతో పోలీసులు రెండో నోటీసు జారీ చేశారు. మంగళవారం ఏప్రిల్ 1వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రమ్మంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు డుమ్మాకొడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించారు. అక్రమ మైనింగు, రవాణాతోపాటు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారనే అభియోగాలు కాకాణిపై నమోదయ్యాయి. పొదలకూరు పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో పోలీసుల తదుపరి యాక్షన్ ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News